11-03-2025 05:17:38 PM
మట్టిపల్లి సైదులు...
మోతే: మండల వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న15 అంగన్వాడి భవనాలకు బడ్జెట్ కేటాయించి పూర్తిచేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల పరిధిలోని రాఘవాపురం గ్రామంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రజాపోరు యాత్రను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ... 2018 సంవత్సరంలో మోతే మండలంలోని 12 గ్రామాలలో 15 అంగన్వాడి నూతన భవనాలు మంజూరు అయ్యాయని అన్నారు. భవనాలు మంజూరు అయి సుమారు 40 శాతం పనులు అయినప్పటికీ బిల్లులు రాని కారణంగా కాంట్రాక్టర్ పనులను మధ్యలోనే వదిలి వేశారని అన్నారు.
ప్రభుత్వం తక్షణమే అసంపూర్తిగా నిర్మాణం చేసి ఉన్న అంగన్వాడి భవనాలకు నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాఘవాపురం క్రీడా ప్రాంగణంలో క్రీడా వస్తువులు ఏర్పాటు చేయకుండా అక్రమంగా బిల్లులు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని విద్యార్థులకు, యువకులకు క్రీడ వస్తువులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కిన్నెర పోతయ్య, కక్కిరేణి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.