కేంద్రానికి క్రెడాయ్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: అఫార్డబుల్ హౌసింగ్ అనే పదానికి నిర్వచనం సవరించాలని కేంద్రాన్ని ప్రముఖ రియాల్టీ డెవలపర్ల సంస్థ కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) కోరింది. రోజురోజుకూ అఫార్డబుల్ హౌసింగ్‌కు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో ఇండ్ల రుణాలపై వడ్డీ చెల్లింపులకు పన్ను పూర్తిగా మాఫీ చేయాలని కోరింది. ప్రస్తుతం ఆదాయ పన్ను చట్టం కింద ఇంటి రుణాలు తీసుకున్నవారు రుణాలపై రూ.2 లక్షల వడ్డీ చెల్లింపుపై ఆదాయ పన్ను మినహాయింపు లభిస్తుంది.
కానీ మొత్తం వడ్డీ చెల్లింపునకు ఆదాయం పన్ను రాయితీ కల్పించాలని క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ అభ్యర్థించారు.క్రెడాయ్ 25వ వార్షికోత్సవం సందర్భంగా రూ.45 లక్షల్లోపు అఫార్డబుల్ హౌసింగ్ అన్న నిర్వచనాన్ని రూ.75లక్షలు80 లక్షలకు సవరించాలని కోరారు. అలాగే రూ.75-లక్షలు80 లక్షల్లోపు విలువ గల నిర్మాణంలో ఉన్న ఇండ్ల నిర్మాణాలపై జీఎస్టీ ఒకశాతానికి పరిమితం చేయాలని అభ్యర్థించారు.
ఇప్పుడు రూ.45 లక్షల్లోపు విలువ గల ఇండ్ల నిర్మాణంపై జీఎస్టీ ఒక్క శాతం ఉంది. రూ.45 లక్షలపై చిలుకు విలువ గల నిర్మాణంలోని ఇండ్లపై ఐదుశాతం జీఎస్టీ వర్తిస్తుంది. దీనిపై డెవలపర్లు ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ క్లయిమ్ చేసుకునేందుకు నిబంధనలు అనుమతించడం లేదు.
2017లో అఫార్డబుల్ హౌసింగ్ అంటే రూ.45 లక్షల్లోపు విలువ గల ఇల్లు అని నిర్ణయించారు. కానీ 2017 నుంచి పెరిగిన వార్షిక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నా, ఈ పరిమితిని రూ.75-80 లక్షలకు పెంచాలని బొమన్ ఇరానీ కోరారు. జీఎస్టీ తగ్గించడంతోపాటు అఫార్డబుల్ హౌసింగ్ నిర్వచనాన్ని సవరిస్తే ఇండ్ల కొనుగోలుదారులు లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. ఇక ఇండ్ల నిర్మాణ అనుమతులకు 12 నుంచి 18 నెలల వరకూ టైం పడుతుందని, వేగంగా అనుమతులు ఇచ్చేలా చూడాలని అభ్యర్థించారు.