- పన్ను రాబడి ఆశాజనకంగా లేదు
- వార్షిక లక్ష్యాన్ని సాధించాల్సిందే
పన్నుల ఎగవేతను కఠినంగా అరికట్టండి
రెవెన్యూ పెంపునకు సంస్కరణలు
అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట
జీఎస్టీ చెల్లింపుల్లో నిక్కచ్చిగా ఉండాలి
ఏవియేషన్ ఇంధనంపై పన్ను సవరింపు
ప్రతి నెల మొదటివారంలో రాబడిపై సమీక్షిస్తా
ఆదాయం తెచ్చే శాఖలపై సమీక్షలో సీఎం రేవంత్
హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ నెలవరకు ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం అంత ఆశాజనకంగా లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే నెలవారీ లక్ష్యాన్ని నిర్దేశించుకొని రాబడి సాధించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే విభాగాలన్నీ నిర్ణీత వార్షిక లక్ష్యాన్ని సాధించేం దుకు ప్రయత్నించాలని సూచించారు.
గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆదాయం పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. పన్నుల ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, రవాణా విభాగాల అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు గురువారం సచివాలయంలో సమీక్ష సమా వేశం నిర్వహించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు సంబంధిత శాఖల అధికా రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. ఇక నుంచి రాబడులపై ప్రతి నెలా లక్ష్యాలను తాను స్వయం గా సమీక్షిస్తానని సీఎం తెలిపారు. ప్రతి శుక్రవారం లక్ష్యాల పురగోతిని డిప్యూటీ సీఎం భట్టి పర్యవేక్షిస్తారని చెప్పారు.
నెలవారీగా లక్ష్యాలు
వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ప్రతి విభా గం నెలవారీగా లక్ష్యాలను రూపొందించుకోవాలని, ఎప్పటికప్పుడు సాధించిన పురోగతిని బేరీజు వేసుకోవాలని సీఎం సూచించారు. ఆదాయం తెచ్చిపెట్టే వనరులపై, పన్నుల వసూళ్లపై అధికారులు నిక్కచ్చిగా ఉండాలని కోరారు. సంబంధిత విభాగాన్ని అవసరమైతే పునర్వ్యవస్థీకరించుకోవాలని, ఆదాయం రాబట్టేందుకు వీలైనన్ని సంస్కరణలు చేపట్టాలని దిశా నిర్దేశం చేశారు. జీఎస్టీ ఆదాయం పెంచుకునే చర్యలు చేపట్టాలని సూచించారు. పెట్రోపై వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గిందని, ప్రత్యామ్నాయంగా ఏవియేషన్ ఇంధ నంపై ఉన్న పన్నును సవరించే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.
రియల్ ఎస్టేట్‌కు బూస్ట్
ఎన్నికల సమయంలో మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగినప్పటికీ అంతమేరకు రాష్ట్రానికి ఆదాయం పెరగకపోవటానికి కారణాల ను సీఎం ఆరా తీశారు. అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేయాలని, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను అరికడితే ఆదాయం పెరిగే అవకాశముందని సమావేశంలో చర్చ జరిగింది. రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని చర్చ జరిగింది.
గత ఆరు నెలల్లో కమర్షియల్ నిర్మాణాలు పెరిగాయని, గృహ నిర్మాణాలు కూడా అదే వరుసలో పుంజుకుంటాయని సీఎం అభిప్రాయపడ్డారు. భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరిగేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇసుక, ఖనిజ వనరుల ద్వారా వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను, లీకేజీలను అరికట్టాలని ఆదేశించారు. ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను సబ్సిడీ కాలం తీరిపోయినందున తిరిగి పన్ను వసూలు చేయటం ద్వారా వాటి అమ్మకాలపై ఏమైనా ప్రభావం పడిందా అనే అంశంపై అధ్యయనం చేయాలని సూచించారు.