calender_icon.png 8 November, 2024 | 2:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదాయం మూరెడు.. ఖర్చు బారెడు

08-11-2024 12:00:00 AM

  1. గతేడాది అక్టోబర్ పోలిస్తే.. ఈ ఏడు నెలల్లో పెరిగిన రాబడి రూ.2,721కోట్లే 
  2. 2023లో రూ.68,015కోట్లు వస్తే.. ఈసారి రూ.70,736 కోట్లు మాత్రమే.. 
  3. వడ్డీల మందం కూడా పెరగని సర్కారు రాబడి
  4. ఆదాయం తెచ్చే అన్ని శాఖలూ మైనస్‌లోనే

హైదరాబాద్,  నవంబర్ 7( విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం విషయంలో తీవ్రమైన ఆర్థిక ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. ప్రభుత్వం పెట్టే ఖర్చుకు వచ్చే ఆదాయానికి ఏ మాత్రం పొంతన ఉండటం లేదు. 2024 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నాటికి వచ్చిన ఆదాయంపై ప్రభుత్వం కూడా సంతృప్తిగా లేనట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ రాబడిపై బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆదాయం వివరాలను డిప్యూటీ సీఎం భట్టికి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆ గణాంకాలను చూసిన డిప్యూటీ సీఎం తీవ్రమైన అంసతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. వాస్తవానికి బీఆర్‌ఎస్ సర్కారు కంటే కాంగ్రెస్ హయాంలో పథకాలు పెరిగాయి.

అందుకు అనుగుణంగానే ఖర్చులు కూడా భారీగా పెరుగుతాయి. వ్యయానికి తగ్గట్టే ఆదాయం కూడా పెరగాల్సి ఉంది. కానీ అలా జరగడం లేదు. ఇప్పటికే బడ్జెట్ అంచనాలకు ఆమడ దూరంలో ఉన్నా ఆదాయాన్ని తెచ్చే శాఖలు గతేడాది రాబడులను కూడా సాధించలేకపోవడం ప్రభుత్వాన్ని కలవరానికి గురిచేస్తోంది. 

ఆమ్దానీ 70,736 కోట్లే..

2023 అక్టోబర్ నాటికి సర్కారు ఆమ్దానీ రూ.68,015కోట్లు కాగా.. ఈ ఏడాది అక్టోబర్ నాటికి రూ.70,736 కోట్ల ఆదాయం సమకూరింది. అంటే గతేడాది కంటే కేవలం రూ.2,721 కోట్లు మాత్రమే పెరగడం గమనార్హం. కాగ్ లెక్కల ప్రకారం సెప్టెంబర్ నాటికే ప్రభుత్వం రూ.13,187.41కోట్ల వడ్డీలను చెల్లించింది.

అంటే ప్రభుత్వానికి వడ్డీల మందం కూడా రాబడి పెరగడం లేదని ఈ గణాంకాలను బట్టి చూస్తే అర్థమవుతోంది. అందుకే రాబడి పెంచే మార్గాలను అన్వేషించాలని డిప్యూటీ సీఎంతో పాటు, సీఎం రేవంత్ రెడ్డి కూడా సంబంధిత అధికారులకు పదేపదే దిశానిర్దేశం చేస్తున్నారు.

అన్ని శాఖలూ మైనస్‌లోనే.. 

ఏ ప్రభుత్వమైనా ప్రతి శాఖ నుంచి ఏడాదికేడాది ఆదాయం పెరుగుతుందని ఆశిస్తుంది. కానీ రేవంత్ సర్కారు పరిస్థితి ప్రస్తుతం ఆ దిశలో లేదు. తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే అన్ని శాఖలు కూడా అక్టోబర్ వసూళ్లలో మైనస్ వృద్ధి రేటును నమోదు చేశాయి. వాణిజ్య పన్నుల విభాగం, ఎక్సైజ్, మైనింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇలా అదాయం తెచ్చే అన్ని శాఖల ఆదాయం కూడా గతేడాది కంటే..

ఈ ఏడాది అక్టోబర్‌లో తగ్గడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. ఎక్సైజ్ శాఖకు గతేడాది అక్టోబర్ నాటికి రూ.11,047కోట్ల ఆదాయం వస్తే.. ఈసారి రూ.10,842కోట్లు మాత్రమే వచ్చింది. గతేడాదితో పోలిస్తే  ఒక్క వాణిజ్య శాఖలో మాత్రమే పెరుగుదల నమోదైంది.

అది కూడా అమ్మకపు పన్ను పుణ్యమా అని వాణిజ్య పన్నుల శాఖలో పెరుగుదల కనిపించింది. అక్టోబర్ నాటికి జీఎస్టీ వసూళ్లు 2శాతం తగ్గాయి. కానీ సేల్స్ ట్యాక్స్ 10శాతం వరకు పెరిగింది. ఈ ఏడు నెల్లలో పెరిగిన రూ.2,721 కోట్లు కూడా అమ్మకపు పన్ను వల్లే అని గణాంకాలు చెబుతున్నాయి.

పథకాల అమలు ఎలా?

ఆదాయం ఆశించినంత రాకపోవడంతో సంక్షేమ పథకాల అమలు అంశం ప్రభుత్వానికి ఛాలెంజింగ్ మారింది. ప్రభుత్వం ఇప్పటికే రైతు రుణమాఫీ కోసం రూ.18వేల కోట్లు ఖర్చు చేసింది. ఇంకో రూ.13వేల కోట్లు వెచ్చించాల్సి ఉంది. ఉచిత్ విద్యుత్ కోసం రూ.350 కోట్లు, ఉచిత బస్సు ప్రయాణం కింద రూ.300 కోట్లు, సబ్సిడీ సిలిండర్ పథకానికి  రూ.250 కోట్లు..

ఇలా పలు సంక్షేమ పథకాలను కాంగ్రెస్ సర్కారు కొత్తగా తీసుకొచ్చింది. వాటికితోడు మరికొన్ని పథకాలను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఆదాయం అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో ఈ సంక్షేమ పథకాలను ఎలా అమలు చేయాలనే సందిగ్ధంలో రేవంత్ సర్కారు ఉన్నది.

ఆదాయం మార్గాలపై రంధ్రాన్వేషణ..

ఇప్పుడొస్తున్న ఆదాయంతో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ అనేది ప్రభుత్వానికి అంత ఈజీ కాదు. అందుకే ఆదాయాన్ని పెంచే మార్గాల కోసం ప్రభుత్వం రంధ్రాన్వేషణ చేస్తోంది. ఆదాయాన్ని పెంచే మార్గాలను కనుక్కోవాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేస్తోంది.

ఇప్పటికే దీనిపై ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా నియమించింది. ఆదాయం తెచ్చే శాఖల అధికారులను సమన్వయం చేసేందుకు రెవెన్యూ మొబిలైజ్‌షన్ పేరుతో పదేపదే సమావేశాలను సీఎం, డిప్యూటీ సీఎం నిర్వహిస్తున్నారు.