calender_icon.png 27 November, 2024 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదాయం ఫుల్.. వసతులు నిల్

27-11-2024 12:30:20 AM

  1. బచ్చన్నపేట సంతలో సమస్యల చింత
  2. తొట్లు, ట్యాంకుల్లో నీళ్లు నింపని వైనం
  3. పైప్‌లైన్ పగిలినా పట్టించుకోని అధికారులు
  4. దప్పికతో అల్లాడుతున్న రైతులు, మూగజీవాలు

బచ్చన్నపేట, నవంబర్ 2౬: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే పశువుల సంతలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. కొన్ని గ్రామాలు, పట్టణాల్లో మాత్రమే ఈ సంతలు నిర్వహిస్తుంటారు. అందులో జనగామ జిల్లాలోని బచ్చన్నపేట పశువుల అంగడిగా పేరుగాంచిన సంత ఒకటి.

ఇక్కడికి ప్రతీ వారం వందలాది రైతులు పశువుల క్రయ, విక్రయానికి వస్తుంటారు. ఈక్రమంలో నిర్వాహకులు, గ్రామపంచాయతీకి సంత ద్వారా మంచి ఆదాయమే సమకూరుతోంది. అయినప్పటికీ సంత నిర్వహణ సక్రమంగా లేక రైతులు, మూగజీవాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. పశువులను నిలిపేందుకు షెడ్లు లేక, తొట్లు, ట్యాంకుల్లో నీళ్లు నింపకపోవడంతో దప్పికతో అల్లాడాల్సి వస్తోంది.

బచ్చన్నపేటలో గ్రామపంచాయతీకి చెందిన ఆరు ఎకరాల స్థలంలో ప్రతీ ఆదివారం పశువుల సంత నిర్వహిస్తుంటారు. ఇక్కడికి జనగామ జిల్లా నుంచే కాకుండా యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట, ఆలేరు, సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, మద్దూరు, గజ్వేల్, జగదేవ్‌పూర్ నుంచి రైతులు వస్తుంటారు.

ప్రతీ వారం ఈ సంతకు సుమారు 300 పశువులు అమ్మకానికి వస్తుంటాయి. ఇక్కడ ఒక పశువును అమ్మినవారు రూ.150, కొనుగోలు చేసేవారు రూ.150 సంత నిర్వాహకులకు పన్నుగా చెల్లిస్తారు. ఇలా ఒక్క పశువు అమ్మకంపై నిర్వాహకులకు రూ.300 ఆదాయం వస్తోంది.

సంత నిర్వహణకు ప్రతి ఏడాది వేలం వేస్తుంటారు. చివరిసారి వేలంలో గ్రామ పంచాయతీకి రూ.2లక్షలకు పైనే ఆదాయం సమకూరింది. అయితే ఆదాయం బాగానే ఉన్నప్పటికీ సంతలో కనీస సౌకర్యాలు లేకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కనీస సౌకర్యాలు లేక..

బచ్చన్నపేట పశువుల అంగడిలో తాగునీరు, షెడ్లు, మరుగుదొడ్లు లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. నీటి తొట్లు ఉన్నా అందులో నీరు నింపకపోవడంతో మూగజీవాలు దూపతో అల్లాడుతున్నాయి. ఇక రైతుల కోసం రెండు ట్యాంకులు ఏర్పాటు చేసినా వాటిలోనూ నీరు నింపడం లేదు. నాలుగు నెలల కిందట ట్యాంక్‌కు సంబంధించిన పైపులైన్ పగిలిపోయి మిషన్ భగీరథ నీరు లీకేజీ అవుతోంది.

అయినా అధికారులు తమకేమీ పట్టనట్టుగా ఉంటున్నారు. షెడ్లు లేక వేసవిలో ఎండకు, వానకాలం బురదలో పశువుల క్రయవిక్రయాలు జరుపుతున్నారు. దూర ప్రాంతాల నుంచి పశువులను తీసుకొచ్చే రైతులు ఒకరోజు ముందుగానే ఇక్కడికి వస్తుంటారు. అలాంటి వారు షెడ్లు, మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

నీళ్లకు తిప్పలైతుంది..

ఈ సంతలో పశువుల అమ్మకాలు, కొనుగోలు చేయడానికి పదేళ్లు గా వస్తున్నా. అంగడిలో చాలా సమస్యలున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. మాకు తాగడానికి నీళ్లు ఉండ వు. కనీసం పశువుల కోసం తొట్టిలో కూడా నీళ్లు నింపట్లే. రశీదు తీసుకోకుంటే వాహనాన్ని బయటికి కూడా పోనివ్వరు.

కనీస సౌకర్యాల మీద మాత్రం వీళ్లకు సోయి లేదు. దూరం నుంచి వచ్చే వాళ్లకు మరింత ఇబ్బంది అయితుంది. పశువుల్ని కొంటే డబ్బులు వసూలు చేస్తున్నరు కానీ.. సౌలతులు మాత్రం లేవు. అధికారులు పట్టించుకొని తాగడానికి నీటి సదుపాయం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. 

 ధర్మారం అంజయ్య, 

ఇటుకాలపల్లి