calender_icon.png 20 November, 2024 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదాయం ఫుల్.. సౌలతులు నిల్

20-11-2024 01:15:08 AM

  1. మెదక్ ఆర్టీఏ కార్యాలయం దుస్థితి
  2. నామమాత్రపు టెస్ట్ డ్రైవింగ్ ట్రాక్
  3. శిథిలావస్థలో అద్దె భవనం 
  4. ఏటా వచ్చే ఆదాయం రూ.35 కోట్లు
  5. జోరుగా ప్రైవేట్ ఏజెంట్ల దందా

మెదక్, నవంబర్ 19(విజయక్రాంతి): అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారైంది మెదక్ రవాణా శాఖ కార్యాలయం పరిస్థితి.. ఓవైపు మెండుగా ఆదాయమున్నా.. వసతులను కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. మెదక్ జిల్లా కేంద్రం ఏర్పాటై ఏండ్లు గడుస్తున్నా సొంత భవనం, డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ లేకపోవడంతో ప్రైవేట్ ఏజెంట్ల దందా మూడుపువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది.

ఎవరికైనా డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేయాలనుకుంటే సదరు వ్యక్తి వాహనం నడిపే తీరును ఆర్టీఏ అధికారులు క్షుణ్నంగా పరిశీలించాల్సి ఉంటుంది. డ్రైవింగ్ పరీక్ష నిర్వహించి ట్రాఫిక్ రూల్స్‌కు అనుగుణంగా వాహనాన్ని నడిపితేనే లైసెన్స్ ఇస్తారు. ఇందుకోసం టెస్ట్ డ్రైవింగ్ ట్రాక్ తప్పనిసరి.

కానీ జిల్లాకేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయానికి తాత్కాలిక డ్రైవింగ్ ట్రాక్‌లోనే నామమాత్ర పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా వెళ్లి అలా వస్తే చాలు..డ్రైవింగ్ టెస్ట్ పూర్తయినట్లే. ఆర్టీఏ కార్యాలయానికి ఏటా ఆదాయం బాగానే ఉన్నా సొంత భవనం, ట్రాక్‌కు నోచుకోవడం లేదు. 

ఏడేళ్లు గడిచినా..

జిల్లాల పునర్విభజన తర్వాత మెదక్‌లో ఆర్టీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అంతకుముందు ఎంవీఐ కార్యాలయం అద్దె భవనంలోనే ఉండేది. ప్రస్తుతం మెదక్ శివారులోని పిల్లికొటాల్ వద్ద అరకొర వసతులతో అద్దె భవనంలో కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. టెస్ట్ డ్రైవింగ్‌కు ట్రాక్ సరిగా లేకపోవడంతో ఓపెన్ ప్లేస్‌లోనే ట్రాక్‌ని ఏర్పర్చి పరీక్షలు చేపడుతున్నారు. 

స్థలం కేటాయించి రద్దు చేశారు..

రవాణా శాఖ కార్యాలయ భవనం, ట్రాక్ ఏర్పాటు కోసం సుమారు 5 ఎకరాల స్థలం అవసరముంటుంది. మెదక్ ఆర్టీఏ కార్యాలయంలో నెలకు సుమారుగా 750 వాహనాల వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. వివిధ పనుల కోసం వందలాది వాహనాలు వస్తుంటాయి.

గతంలో సొంత భవనం కోసం రాజ్‌పల్లి శివారులో 5.5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. కాగా శాఖకు స్థలాన్ని అప్పగించకపోగా ఇదే స్థలంలో మెడికల్ కాలేజీ మంజూరు కావడంతో ఆర్టీఏ కార్యాలయం కోసం కేటాయించిన స్థలాన్ని కాలేజీ నిర్మాణానికి ఇచ్చేశారు.

ప్రైవేట్ ఏజెంట్ల జోరు..

మెదక్ రవాణా కార్యాలయంలో ప్రైవేట్ ఏజెంట్ల జోరు సాగుతోంది. వాహనాల రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారు కార్యాలయానికి కాకుండా ప్రైవేట్ ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు కార్యాలయంలో ట్రాక్ లేకపోవడంతో అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తూ ఏజెంట్లు తెచ్చిన కస్టమర్లకు లైసెన్సులు జారీ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇదే అదనుగా ఏజెంట్లు జోరుగా దందా కొనసాగిస్తూ వాహనదారుల నుంచి దండిగా వసూలు చేస్తున్నారు.

ప్రతినెలా రూ.2 కోట్ల రాబడి

మెదక్ రవాణా శాఖ కార్యాలయానికి యేటా సుమారు రూ.35 కోట్ల ఆదాయం వస్తుంది. సెప్టెంబర్ నెలలో క్వార్టర్లీ టాక్స్ రూపంలో రూ.27.37 లక్షలు, లైఫ్ టాక్స్ రూ.188.60 లక్షలు, సర్వీస్ టాక్స్ కింద రూ.11.36 లక్షలు, డిటెక్షన్ కింద రూ.6.34 లక్షలు కలుపుకొని మొత్తంగా రూ.2.81 కోట్ల ఆదాయం వచ్చింది.

ప్రస్తుతమున్న అద్దె భవనం శిథిలావస్థకు చేరడం, సరైన టెస్ట్ ట్రాక్ లేకపోవడంతో వాహనదారులతో పాటు శాఖాధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదాయం వస్తున్నా వసతులు కల్పించాల్సిన యంత్రాంగం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై ఆర్టీఓ కార్యాలయ కార్యనిర్వహణాధికారి భానుప్రసాద్‌ను కోరగా.. స్థలం కేటాయించి రద్దు చేశారని, వేరే స్థలం కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.