calender_icon.png 24 October, 2024 | 9:55 AM

ఆదాయం ఫుల్.. వసతులు నిల్

09-08-2024 01:45:51 AM

  1. అద్దె భవనంలో కొనసాగుతున్న ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం 
  2. అరకొర వసతులతో తిప్పలు

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 8 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఆదాయం బాగున్నా కనీస వసతులు అందుబాటులో లేకపోవడంతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం అభివృద్ధిలో దూసుకుపోతోంది. దీంతో ఇక్కడ భూముల రేట్లు అమాంతం పెరిగాయి. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారి సంఖ్య కూడా పెరిగింది.

ప్రతిరోజు దాదాపు 40 నుంచి 80 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అయితే, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సొంత భవనం లేకపోవడంతో అద్దె భవనంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. నూతన భవనాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టినప్పటికీ అసంపూర్తి పనుల కారణంగా మధ్యలోనే నిలిచిపోయింది. సొంత భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని, అదేవిధంగా అందులో షట్టర్లను ఏర్పాటు చేసినట్లుతై డాక్యుమెంట్ రైటర్ల నుంచి అద్దె కూడా వచ్చే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.  

వసతుల లేమితో..

ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ఇరుకు గదుల్లో అరకొర సౌకర్యాల నడుమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్‌తో పాటు 10 మంది పనిచేస్తున్నారు. భవనానికి ప్రతి నెల రూ.2,050 వరకు అద్దె చెల్లిస్తున్నారు. కాగా భవనంలో తాగునీటి సౌకర్యం, మూత్రశాలలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. అదేవిధంగా పార్కింగ్ సౌకర్యం కూడా సరిగా లేకపోవడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చే క్రయవిక్రయదారులు తమ వాహనాలను రోడ్డుపైనే పార్కింగ్ చేస్తున్నారు.  

అందుబాటులోకి తీసుకురావాలి

తాత్కాలికంగా అంటూ అద్దె భవనంలో ఐదు దశాబ్దాల క్రితం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నేటికీ అదే భవనంలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. నూతన భవన నిర్మాణం కోసమని 2016లో రూ.63 లక్షలు మంజూరు చేశారు. ఆ నిధులు వెనక్కిపోవడంతో భవన నిర్మాణానికి ముందడుగు పడలేదు. అనంతరం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2022లో రూ. 1.50 కోట్ల వ్యయంతో భవనాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. మాజీ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయగా, నిర్మాణ పనులు స్లాబ్ వరకు వచ్చి అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ప్రజాప్రతినిధులు స్పందించి భవన నిర్మాణ పనులను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలి.

 పల్లాటి రాములు, 

బీఎస్పీ రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి