12-03-2025 12:03:39 AM
పార్లమెంటులో ఎంపీ డీకే అరుణ
హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వాల్మీకీ బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పార్లమెంట్‌లో పేర్కొన్నారు. రెండో విడత బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంగళవారం జీరో అవర్‌లో ఆమె ఈ అంశాన్ని ప్రస్తావించారు. వాల్మీకీ బోయలు నేటికీ ఆర్థికంగా, విద్యా పరంగా, సామాజికంగా చాలా వెనకబడి ఉన్నారని తెలిపారు.
కర్ణాటకతో పాటు అనేక రాష్ట్రాల్లో వాల్మీకి బోయలు ఎస్సీ, ఎస్టీలుగా గుర్తింపు పొందారన్నారు. అయితే తెలంగాణ, ఏపీలో ఇప్పటికీ బీసీ సామాజిక వర్గంలోనే ఉన్నారని, ఫలితంగా వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. తెలంగాణలో వాల్మీకి బోయల వర్గం 5 లక్షల మందికిపైగా ఉన్నారని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే చెల్లప్ప కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలిపి వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్లు గుర్తు చేశారు. కేంద్ర గిరిజన శాఖ మంత్రి తన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని డీకే అరుణ విజ్ఞప్తి చేశారు.