calender_icon.png 18 November, 2024 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాదేశ్‌లో ఆగని దాడులు

02-09-2024 12:22:47 AM

హిందూ టీచర్లపై అతివాదుల దౌర్జన్యాలు

బలవంతంగా ఉద్యోగాలకు రాజీనామాలు

ఢాకా, సెప్టెంబర్ 1: బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై ఇస్లామిక్ రాడికల్ మూకల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇన్నాళ్లు వారి ఆస్తులను టార్గెట్ చేసిన అతివాదులు.. తాజాగా మైనారిటీల ఉద్యోగాలపై పడ్డారు. ఆ దేశ ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో టీచర్లు, అధ్యాపకులుగా పనిచేస్తున్న హిందువులతో బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు. అందుకు ఒప్పుకోకపోతే చంపుతామని బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇప్పటి వరకు 50 మంది టీచర్లతో రాజీనామాలు చేయించారని తెలిసింది.

వాస్తవంగా ఉద్యోగాలు వదులుకున్నవారి సంఖ్య చాలా అధికం గా ఉంటుందని చెప్తున్నారు. బరిషాల్‌లోని బాకేర్‌గంజ్ కాలేజీ ప్రిన్సిపాల్ శుక్లారాణి హల్దార్‌తో ఆగస్టు 29న ఇస్లామిక్ అతివాదులు బలవంతంగా రాజీనామా చేయించిన ట్టు తెలుస్తోంది. ఓ గుంపు ఆమె కార్యాలయంలోకి చొరబడి తీవ్రంగా బెదిరించటంతో చేసేదేమీలేక ఆమె ‘రాజీనామా చేస్తున్నాను’ అని రాసి సంతకం చేసి వారికి ఇచ్చారు. ఆగస్టు 18న అజీంపూర్ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ గీతాంజలీ బారుబాతో పాటు టీచర్లు గౌతంచంద్రపాల్, షహనాజ్‌ను కూడా బెదిరించి రాజీనామా చేయించారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. 

భయంతో బతుకుతున్నాం

స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ఎటునుంచి ఎవరు దాడి చేస్తారోనని భయంగా బతుకుతున్నామని కబీ నుజ్రుల్ యూనివర్సిటీలో ప్రభుత్వ పాలన విభాగం హెడ్‌గా పనిచేసిన ప్రొఫెసర్ సంజయ్‌కుమార్ ముఖర్జీ వాపోయాడు. ఆయనతో కూడా ఇస్లామిక్ అతివాదులు బలవంతంగా రాజీనామా చేయించారు. ‘ప్రోక్టర్, డిపార్ట్‌మెంట్ హెడ్ పదవి నుంచి నన్ను కూడా బలవంతంగా రాజీనామా చేయించారు. ప్రస్తుతం మేం చాలా భయంగా ఉన్నాం’ అని తెలిపారు. మైనారిటీ విద్యావంతలుపై దాడులను బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ ఐక్యపరిషత్ విద్యార్థి విభాగం బంగ్లాదేశ్ ఛాత్ర ఐక్య పరిషత్ ఖండించింది.

‘బంగ్లాదేశ్‌లో టీచర్లతో బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు. గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన జర్నలి స్టులు, మంత్రులు, అధికారులను చంపేస్తున్నారు. వేధిస్తున్నారు. జైళ్లలో వేస్తున్నారు. అహ్మదీ ముస్లిల పరిశ్రమలను తగులబెడుతున్నారు. సూఫీ ముస్లింల మజర్స్, దర్గాలను ఇస్లామిక్ ఉగ్రవాదులు కూల్చేస్తున్నారు. వీటిని ఆపేందుకు యూనస్ ఏమీ చేయటంలేదు’ అని ఆ సంఘం నేతలు ఆవేదన వ్యక్తంచేశారు.