calender_icon.png 15 November, 2024 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

14న ప్రజా విజయోత్సవ ప్రారంభోత్సవం

12-11-2024 12:53:13 AM

  1. ఎల్బీ స్టేడియంలో 14 వేల మంది విద్యార్థులతో సమావేశం
  2. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి

హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తున నేపథ్యంలో నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవ ప్రారంభ కార్యక్రమాన్ని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి (బాలల దినోత్సవం) సందర్భంగా ఈ నెల 14న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలో సంబంధిత అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, ముఖ్య కార్యదర్శులు శ్రీధర్‌బాబు, బుర్రా వెంకటేశం, కార్యదర్శి శరత్ సమీక్షలో పాల్గొన్నారు. ఏడాది కాలంలో విద్యార్థుల కోసం చేసిన గణనీయమైన మార్పులపై చర్చించారు.

డైట్ చార్జీల పెంపు, అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఇంటి గ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు, పాఠశాలలకు ఉచిత కరెంట్, తదితర ఎన్నో కార్యక్రమాలను చేపట్టినట్టు గుర్తుచేశారు. ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తున సందర్భంగా ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు 26 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినట్టు పేర్కొన్నారు.

ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజైన 14న ప్రభుత్వ, గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థుల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఇందుకోసం పాఠశాలల విద్యార్థులతో మోడల్ అసెంబ్లీ, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు, ఈ ఏడాది కాలంలో విద్యాశాఖలో వచ్చిన గణనీయమైన మార్పులు, అభివృద్ధిపై ఏవీ ప్రదర్శన ఉంటుందని వివరించారు. విద్యాశాఖపై ప్రత్యేకంగా రూపొందించిన సావనీర్‌ను సీఎం ఆవిష్కరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ప్రతి జిల్లా నుంచి విద్యార్థులు హాజరవుతారని చెప్పారు.