11-12-2024 12:38:23 AM
* హాజరుకానున్న హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, కర్ణాటక సీఎం
* ఏర్పాట్లపై సమీక్షంచిన మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): నార్సింగి మున్సిపాలిటీలోని కోకాపేట్‌లో దొడ్డి కొమురయ్య కురుమ సంఘ ఆత్మగౌరవ భవనాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 14న ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరుకానున్నారు. భవనం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం అధికారులతో సమీక్షించారు. భవనానికి విద్యుత్, వాటర్ కనెక్షన్ చేయాలని అధికారులకు సూచించారు. సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
భారీగా జన సమీకరణ చేయాలని ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, కురుమ సంఘం ప్రతినిధులకు మంత్రి సూచించారు. సభకు వచ్చే వారి వాహనాలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. సీఎం సభా స్థలం, తదితర పనులను కలెక్టర్, పోలీస్ అధికారులు పరిశీలించాలని ఆదేశించారు. అన్ని విభాగాలను సమన్వయం చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్‌కు సూచించారు. సమీక్షలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, హెఎండీఏ కమిషనర్ సర్పరాజ్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయదేవి, జీహెఎంసీ కమిషనర్ ఇలంబర్తి, ఐఅండ్‌పీఆర్ కమిషనర్ హరీశ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.