27-02-2025 10:56:23 PM
ఉద్యోగ రంగంతో పాటు రాజకీయ రంగంలో రిజర్వేషన్‌ల కోటా పెంచాలి
ఆవిర్భావ సభలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
ముషీరాబాద్,(విజయక్రాంతి): మైనారిటీలకు విద్య, ఉద్యోగ రంగంతో పాటు రాజకీయ రంగంలో రిజర్వేషన్‌ల కోటా పెంచాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ(Padma Shri Manda Krishna Madiga) అన్నారు. జీవన ప్రమాణాల్లో మెరుగుదల కోసం మైనార్టీలకు ప్రభుత్వాల నుంచి తోడ్పాటు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ మేరకు గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో భారత్ మైనారీటీస్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆవిర్భావ సమావేశం ఫోరం కన్వీనర్, సీనియర్ జర్నలిస్టు ఇస్మాయిల్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఫోరం ఆవిర్భావ జెండాను ఆయన మందకృష్ణ మాదిగ ఫోరం ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... దేశంలో మైనారీటీల జీవితాల్లో వెలుగులు నిండాలి అంటే పేదరికం పోవాలని, మైనారిటీలు దయనీయస్థితిలో ఉండడానికి కారకులు ఎవరో గుర్తించి వాస్తవాలు గ్రహించడం ద్వారా భవిష్యత్తులో చైతన్యం చాటాలని ఆయన పిలుపునిచ్చారు. మత విద్వేశాలు, వైషమ్యాలు రెచ్చగొట్టే వాళ్ల ఉచ్చులో పడకుండా వదిలేస్తున్నాయని, రాజకీయ భాగస్వామ్యం ఇవ్వడం లేదన్నారు. ప్రతికారం పెంచుకోవడం ద్వారా సాధించేది శూన్యమని అదే పరివర్తనకు ప్రయత్నిస్తే ఏదైనా సాధించ వచ్చని అన్నారు. ఇప్పటికైనా మైనార్టీలు తమ స్వతంత్ర ఎజెండాతో వెళ్లాలన్నారు. భవిష్యత్తులో దళిత బహుజనులతో పాటు మైనారిటీలు ఐక్య ఉద్యమాలు చేసి తమ హక్కులు సాధించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎంఆర్‌పీఎఫ్ వ్యవస్థాపకులు సయ్యద్ ఇస్మాయిల్ మాట్లాడుతూ సచార్ కమిటీ నివేదికను అమలు చేయాలని, స్థానిక ఎన్నికల్లో మైనారిటీలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మైనారిటీలు పేదరికంలో ఉండటానికి కారణమైన పార్టీలకు తగిన గుణపాఠం చెపుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎంఎ మాలిక్, ప్రొఫెసర్ అన్వర్ , అలీం, సయ్యత్ ఆసిఫ్ హుస్సేన్, సినీ సంగీత దర్శకుడు ఎస్‌వీ ఖుద్దూస్, యూసఫ్ బాబా, షాహిన్, వసీం, వాహెద్, గబ్బార్, ఇక్బాల్, సద్దాం తదితరులు పాల్గొన్నారు.