- సోషల్ మీడియాలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వీడియో వైరల్
- బీఆర్ఎస్ నేతలపై ఎస్పీకి ఆదివాసీల ఫిర్యాదు
నిర్మల్, జనవరి 28 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో మంగళవారం మైనార్టీలపై ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఖానాపూర్‌లో అబ్దుల్ కలాం విగ్రహ ఏర్పాటుకు మూడు రోజుల క్రితం మున్సిపల్ ముగింపు సమావేశంలో తీర్మాణం చేశారు.
విగ్రహ ఏర్పాటకు ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టారు. విగ్రహ ఏర్పాటుపై కొందరు రాజకీయం చేయడంతో ఎమ్మెల్యే పనులు నిలిపి వేయించారు. పనులు చేపట్టాలని మంగళవారం ఖానాపూర్‌లో ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌ను కోరేందుకు మైనార్టీ నాయకులు వెళ్లగా..
ఎమ్మెల్యే పరుష పదజాలంతో మాట్లాడినట్టు వీడియో వైరల్ అయ్యింది. మైనార్టీలను కించ పరిచే విధంగా మాట్లాడిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని, ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మైనార్టీ నాయకులు ప్రకటన విడుదల చేశారు.
కాగా ఎమెల్యే మాట్లాడినట్టు ఉన్న వీడియోలను బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు వైరల్ చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘం నేతలు మంగళవారం సాయంత్రం ఎస్పీ జానకి షర్మిలకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు.