calender_icon.png 13 February, 2025 | 4:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుచితం!

13-02-2025 12:00:00 AM

ఉచిత పథకాలు మంచివి కావు. వీటి కారణంగా ప్రజలు కష్టపడి పని చేసేందుకు ఇష్టపపడం లేదంటూ సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎడాపెడా ఉచిత పథకాలను ప్రకటిస్తున్న రాజకీయ పార్టీలకు కనువిప్పు కావాలి. ఒకప్పుడు సమాజం లో వెనుకబడిన ఏదైనా వర్గానికో లేదా, ఓ వెనుకబడిన  ప్రాంత అభివృ ద్ధి కోసమో హామీలు ప్రకటించే వారు.

లేదా కరోనా లాంటి ప్రకృతి విపత్తు ఎదురైనప్పుడు ఆహార ధాన్యాల పంపిణీ లాంటి పథకాలను ప్రభుత్వాలు ప్రకటించేవి. కాబట్టి అప్పట్లో  వీటికి పెద్దగా వ్యతిరేకత రాలేదు. అయితే కాలక్రమంలో ఈ ఉచితాల సంస్కృతి క్యాన్సర్ మహమ్మారిగా మారిపోయింది. అధికారమే పరమావధిగా రాజకీయ పార్టీలు ఎన్నికల సమ యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా లెక్కచేయకుండా ఎడాపెడా ఉచిత హామీలను ఇచ్చేస్తున్నాయి.

ఫలితంగా అధికారంలోకి వచ్చాక ఆ హామీలను అమలు చేయడానికి ఖజానా అనుమతించకపోవడంతో నానా అవస్థలు పడుతున్నాయి. ఇంతకీ ఈ ఉచితాల సంస్కృతి పుట్టింది తమిళనాడులో. ఒకప్పటి మద్రాసు రాష్ట ముఖ్యమంత్రి కామరాజ్ 195364 మధ్య కాలంలో పాఠశాల విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత భోజనం రూపంలో తొలిసారి ఉచితాలకు అంకురార్పణ చేశారు.

ఆ తర్వాత 1967 లో డీఎంకే వ్యవస్థాపకుడు సిఎన్ అణ్ణాదురై తమను గెలిపిస్తే రూ.1కే 4.5 కిలోల బియ్యం ఇస్తామంటూ హామీ ఇచ్చి దీన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు. అది అక్కడితో ఆగలేదు. 2006 అసెంబ్లీ ఎన్నికల సమయం లో ఓటర్లకు ఉచిత కలర్ టీవీలు ఇస్తామని హామీ ఇచ్చి తమ ఉచితాల ఆటలో మరింత దూకుడు ప్రదర్శించింది.

ఆ తర్వాత జయలలిత కూడా అదే రీతిల్లో కుక్కర్లు, గ్రైండర్లు అంటూ రకరకాల ఉచితాలతో ఓటర్లను ఆకట్టుకోవడానికి యత్నించారు. అప్పటిదాకా ఒక్క తమిళనాడుకే పరిమితమైన ఈ ఉచితాలు ఆ తర్వాత దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరించింది.

పార్టీలు ఒకరిపై మరొకరు పైచేయి సాధించడం కోసం నగదు సాయం, ఉచిత కరెంటు, నీళ్లు, ఇళ్ల స్థలాలు, చివరికి కాన్పు సమయంలో సహాయం ఇలా రకరకాల ఉచితాలను ప్రకటించ సాగాయి. దీంతో ఇప్పుడు పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే ఉచితాలు ఇవ్వక పోతే ఓటర్లు తమ పార్టీకి ఓటేయరేమోనన్న భయం రాజకీయ పార్టీలకు పట్టుకుంది. అందుకే వాటి మేనిఫెస్టోల్లో అన్నీ ఉచితాల హామీలే ఉంటున్నాయి.

2015లో ఆమ్‌ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలకు ఉచిత కరెంట్, ఉచిత తాగునీరు హామీతో ఎవరూ ఊహించని విధంగా తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అక్కడినుంచి ఆ పార్టీ ఎక్కడ పోటీ చేసినా ఉచిత హామీలే దాని ప్రధాన ఎన్నికల అజెండాగా ఉంటోంది.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రకటించిన ఉచిత హామీలను చూసి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ ‘రేవడి’ సంస్కృతి దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోందంటే ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అదే మోదీ నేతృత్వంలోని బీజేపీ మొన్నటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌తో పోటీ పడి ఉచితాలను ప్రకటించడం తెలిసిందే. అయితే ఓటర్లు కూడా తెలివి మీరిపోయారు.

ఏ పార్టీ వాళ్లు ఏమిచ్చినా తీసుకొంటున్నారు. ఆ తర్వాత తాము ఎవరికి ఓటేయాలో వారికే వేస్తున్నారనడానికి ఢిల్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. అయితే ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు గతంలో కూడా తీవ్ర వ్యాఖ్యలే చేసింది. అయినా పార్టీల అధికార దాహం ముందు ఆ వ్యాఖ్యలు అరణ్య రోదనగానే మిగిలి పోయాయి. కట్టడి చేయాల్సిన ఎన్నికల కమిషన్ ఈ ఉచితాలపై చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది.

గతంలో సుప్రీంకోర్టు సూచించినట్లుగా ఆర్థిక శాఖ, ఆర్‌బీఐ, నీతి ఆయోగ్ .. ఇలా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అన్ని విభాగాల నిపుణులతో ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి ఈ ఉచితాల కట్టడికి ఆ కమిటీ  చేసే సిఫార్సుల అమలుకు చట్టం చేసేందుకు కేంద్రం నడుం బిగిస్తేనే పరిష్కారం లభిస్తుంది. అయితే అది కూడా ఫిరాయింపుల చట్టంలా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.