calender_icon.png 24 October, 2024 | 4:07 AM

మీ కలల ఇంటిలో.. జలసిరులు ఉన్నాయా !

14-07-2024 12:05:00 AM

* ‘మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పు ఉందా? అని గతంలో ప్రజలను ఓ కంపెనీ ప్రకటన రూపంలో ప్రశ్నించినట్టుగానే.. ప్రస్తుతం మీ ఇంట్లో నీళ్లు ఉన్నాయా? అని అద్దె ఇంటి కోసం వెతుకుతున్న టెనెంట్స్ అడుగుతున్నారు’

  బోడుప్పల్ మున్సిపాలిటీ 

పరిధిలోని ఓ ఇంటి యజమాని. 

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 13 (విజయక్రాంతి): హైదరాబాద్ పరిధిలో ఇంటి నిర్మాణం కోసం ప్లాట్ తీసుకోవాలి. నగరంలో సొంతింటి కలను నెరవేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే మీరు స్థిరంగా నివాసం ఉండాలి అనుకుంటున్న ప్రాంతంలో భూగర్భ జలాలు ఉన్నాయా? లేవా? ఉంటే అవి ఎంత లోతులో ఉన్నాయి? వేసవిలో ఆ ప్రాంతంలో భూగర్భ జలాల లభ్యత ఉంటుందా? బోర్లు పూర్తిగా తడారి ట్యాంకర్లపైనే ఆదారపడాల్సి వస్తుందా? అనే వివరాలపై ఆరా తీయాల్సిన సందర్భం ఇది.

లేదంటే మీకు భవిష్యత్తులో నీటి కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. వాస్తవానికి ప్రతి జీవి కనీస అవసరం నీరు. నీరు ఉన్నదగ్గరే నాగరికతతోపాటు నగరాలు పుట్టుకొచ్చాయి. ఒకవేళ నీరు లేదంటే ఆ ప్రాంతంలో జీవి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. దేశంలోని ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రస్తుతం నీటి కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. వేసవి వచ్చిందంటే చాలు.. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. వేల సంఖ్యలో నీటి ట్యాంకర్లు రోడ్డు ఎక్కుతున్నాయి. ప్రజల జేబులకు నీళ్లు చిల్లు పెడుతున్నాయి. అయినా నగర ప్రజల్లో మార్పు రావడంలేదు. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలోని ప్రజల నిర్లక్ష్యం భవిష్యత్ తరాలకు శాపంగా మారుతోంది.

వాననీటిని సంరక్షించడంలో విఫలం

హైదరాబాద్‌లో ఏటా సుమారు 800 నుంచి 900 మిల్లీలీటర్ల వర్షం కురుస్తుంది. అయితే ఆ వాన నీటిని సంరక్షించి భూగర్భ జలాలను పెంచేందుకు మెజార్టీ ప్రజలు కనీస ప్రయత్నం చేయడంలేదు. వెరసి మొత్తం వాన నీటిలో సుమారు 90 శాతం మురుగు కాలువల ద్వారా మూసీలో కలిసిపోతోంది. గత వేసవిలో నగరంలోని 80 శాతం ప్రాంతాల్లోని ప్రజలు నీటి ట్యాంకర్లపై ఆదారపడ్డారు. ఈ క్రమంలోనే జలమండలి అధికారంగా కేవలం మూడు నెలల్లోనే 7 లక్షల ట్యాంకర్ల నీటిని నగర ప్రజలకు సరఫరా చేసింది.

అంటే సగటున ప్రతి రోజు సుమారు 8 వేల ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి వచ్చింది. అయితే నగరంలో దాదాపు 38 వేల ఇండ్లలో నీటి కష్టాలు వచ్చినట్టు గుర్తించిన అధికారులు, సుమారు 5,067 ఇండ్లపై సర్వే నిర్వహించగా, మెజార్టీ ఇండ్లలో బోర్లు పూర్తిగా ఎండిపోయినట్టు గుర్తించారు. వీటిలో మెజార్టీ ఇండ్లలో ఇంకుడు గుంతలు లేకపోగా, ఇంకుడు గుంతలు ఉన్న ఇండ్లలో వాటిని సక్రమంగా నిర్వహించడం లేదు. దీంతో భూగర్భ జలాలు రీస్టోర్ కావడంలేదు. కానీ ఇంటిపైకప్పు నుంచి పడే వర్షం నీటిని నేరుగా ఇంకుడు గుంతలలోకి మళ్లించడం వల్ల భూగర్భ జలాలను వృద్ధి చేసుకోవాలని, లేదంటే నేరుగా నీటిట్యాంకులో వర్షం నీటిని జమచేసి ఫిల్టర్ చేసిన తర్వాత వాడుకోవాలని ఇంకుడు గుంతలకు సంబంధించి జలమండలి ప్రత్యేక అధికారి సత్యనారాయణ సూచిస్తున్నారు.

నిబంధనలున్నా అమలు శూన్యం

ప్రభుత్వం పట్టణాల్లో ఇంటి నిర్మాణ అనుమతు లను జారీ చేసే సమయంలోనే ఇంకుడు గుంతలు ఉండాలని నిబంధనలు పెట్టారు. కానీ వాటిని మెజార్టీ ఇంటి యజమానులు పాటించడం లేదు. నగరంలో 80 శాతం ఇండ్లలో ఇంకుడు గుంతలు లేకపోగా, ఉన్న 20 శాతం ఇండ్లల్లోనూ వాటిని సక్రమంగా నిర్వహించడం లేదు. దీంతో అనేక నగరాలతోపాటు హైదరాబాద్‌లోనూ గతంలో ఎన్నడూ లేనివిధంగా నీటి సమస్య ఉత్పన్న మయ్యింది. బోర్లు ఎండిపోవద్దు అంటే ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత ఉండాలని జలమండలి ప్రత్యేక అధికారి సత్యనారాయణ సూచించారు.