13-04-2025 01:03:09 AM
సిద్దిపేట, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ఏ ఊర్లో పూర్తి రుణమాఫీ జరిగిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరిశ్‌రావు డిమాండ్ చేశారు. శనివారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనేపల్లి, రామునిపట్ల, ఇబ్రహీంనగర్ గ్రామాల్లో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటనలు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలో వడగండ్ల వానకు తీవ్ర పంట నష్టం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా చేస్తామని బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించి, మొండిచేయి చూపించిందన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత వారం 3,000 ఎకరాలు, మొత్తంగా 12 వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందన్నారు.
కోడూరు మండలంలో రుణమాఫీ జరిగిన రైతులు 5,300 మంది ఉంటే ఇంకా 7,352 మందికి రుణమాఫీ జరగలేదని చెప్పారు. హెచ్‌సీయూలో 400 ఎకరాల్లో చెట్లను నరికారాని, అధికారులు తమ ఉద్యోగాలు పోయి జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని హరీశ్‌రావు అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు పనుల వల్ల అధికారులు బలయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారకు.
నిర్మాణరంగంలో ఉపాధికి ఊతం పోసే విధంగా సిద్దిపేటలో న్యాక్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ రజతోత్సవ మహాసభ వాల్ పోస్టర్‌ను హరీశ్‌రావు విడుదల చేశారు. అనంతరం సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద నిర్మించిన లారీ ఓనర్స్ అసోసియేషన్ భవనాన్ని ప్రారంభించారు.