calender_icon.png 1 November, 2024 | 10:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడో విడతలో ముమ్మరం!

12-05-2024 01:08:17 AM

కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ

ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ప్రతి ఒక్కరికీ నోటీసు ఇవ్వాలనే ఆలోచన

ముగిసిన రెండో విడత విచారణ

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచా రణకు నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ రెండో విడత విచారణ దాదాపుగా ముగిసింది. ఈ నెల చివరి వారంలో మూడవ విడత విచారణను మొదలు పెట్టాలనే ప్రణాళికతో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ విడతలో విచారణను ముమ్మరం చేయాలని కమిషన్ సూచనలు చేసినట్టు సమాచారం. రెండో విడతలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో కమిషన్ సమావేశమయ్యింది.

అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బరాజ్‌లను సందర్శించింది. శనివారంకూడా నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, నోడల్ అధికారి నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కమిషన్ సమావేశమై.. ప్రాజెక్టుకు సంబంధించిన నివేదికలు, రికార్డులు, ఫైళ్లపై చర్చించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే కమిషన్‌కు కార్యదర్శిగా హైకోర్టు రిజిస్ట్రార్‌ను నియమించు కున్నారు. అలాగే ప్రత్యేక న్యాయవాదినికూడా నియమించారు.

దీనితో నోటీసులపై దృష్టి సారించిన కమిషన్ శనివారం నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశం సందర్భంగా.. నోటీసులు ఎవరెవరికి ఇవ్వాలనే దానిపై చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ప్రాజెక్టులో ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ఉన్న ప్రతి వారికీ ఇవ్వాల్సిందేనని కమిషన్ స్పష్టంగా అధికారులకు సూచించినట్టు తెలుస్తుంది. ఇందులో సాంకేతికంగా ఇటు అధికారులు, అటు అప్పటి ప్రభుత్వంలోని ముఖ్యమైన వారుకూడా వచ్చే అవకాశం ఉంది.

అందుకే వారందరి జాబితాను రూపొందించి నోటీసులు జారీచేయడంపై దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఆదివారం కమిషన్ కోల్‌కతా వెళ్లనున్నారు. తిరిగి మూడో విడత విచారణను ఈనెల చివరి వారంలో చేపట్టే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా ఏమేం చేయాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై ప్రత్యేక కార్యదర్శి, కమిషన్ కార్యదర్శికి కమిషన్ స్పష్టమైన సూచనలు ఇచ్చినట్టు తెలుస్తుంది.