23-02-2025 01:13:58 AM
8 మంది మిస్సింగ్
నాగర్‌కర్నూల్/హైదరాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): శ్రీశైలం ఎడమగట్టు కాల్వ(ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలోని ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. మట్టిదిబ్బలు కూలిపడి అందులో 8 మంది కార్మికులు చిక్కుకుపోగా..ప్రమాదాన్ని వేగంగా పసిగట్టిన 47మంది బయటకు
పరుగులు తీశారు. విషయం తెలిసిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రమాద ఘటన వివరాలు తెలుసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ సీఎం రేవంత్‌రెడ్డికి ఫోన్ చేశారు. కార్మికులను బయటకు రప్పిం చడానికి పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వ సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. కాగా, కార్మికులను బయటకు తీసుకురావడానికి ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ దళాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. నీటి ఊట లీకేజీతో మట్టిదిబ్బలు బురదగా పేరుకుపోవడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు.
ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలోని ప్రాజెక్టు నిర్మాణం పనుల్లో శనివారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. అండర్‌గ్రౌండ్ టన్నెల్ నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో శ్రీశైలం ఎడమగట్టు ప్రాంతం నుంచి 14 కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న నిర్మాణ పనుల వద్ద సుమారు మూడు మీటర్ల మేర మట్టిదిబ్బలు కూలిపడ్డాయి. దీంతో అక్కడే పనుల్లో నిమగ్నమైన కార్మికుల్లో మట్టిదిబ్బలతో పాటు నీటిఊట లీకేజీ వల్ల 8 మంది బురదలోనే చిక్కుకున్నారు. మరో 47 మంది కార్మికులు నీటిఊట ను గుర్తించి బయటకు పరుగులు తీశారు.
ఉదయం 8.30గంటల సమయంలో..
దోమలపెంట సమీపంలో జరుగుతున్న పనుల్లో మొదటి షిఫ్ట్‌లో సుమారు 50 మందికి పైగా కార్మికులు సొరంగంలోకి వెళ్లారు. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కార్మికులు పనిచేస్తుండగా..అకస్మాత్తుగా పైకప్పు కూలి మట్టిపెల్లలు విరిగిపడ్డాయి. దీంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు. వారిలో 42 మంది బయటకు రాగా..8మంది కార్మికులు లోపల చిక్కుకున్నారు.
ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మనోజ్ రూబెన, శ్రీనివాస్, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సందీప్‌సాహూ, జట్కా హీరాన్, సంతోశ్‌సాహు, అంజుసాహూ, పంజాబ్ రాష్ట్రానికి చెందిన గుర్‌జీత్‌సింగ్, జమ్మూ కశ్మీర్‌కు చెందిన సన్నీత్‌సింగ్ మట్టిదిబ్బల కిందే చిక్కుకుపోయారు. సంఘటన జరిగిన వెంటనే కలెక్టర్ బాదావత్ సంతోశ్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అప్రమత్తమయ్యారు.
విషయం తెలిసిన మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పరిస్థితిని సమీక్షించారు. మట్టిదిబ్బల కింద చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, సింగ రేణి రెస్క్యూ టీమ్ , భారత ఆర్మీ సహాయం తో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు ముమ్మర ఏర్పాట్లు చేశారు.
సంఘటనా స్థలానికి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు 11గంటలకు చేరుకొని టన్నెల్ లోపలి వరకు వెళ్లి అక్కడి ప్రాజెక్టు ఇంజినీర్ అమెరికాకు చెందిన సాంకేతిక నిపుణుడు గ్లాన్ మైనార్డ్‌ను ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నీటి ఊట బురదగా పేరుకుపోవడం వల్లే
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి ఉత్తమ్ అనంతరం మీడియాతో మాట్లాడారు.. ఇలాంటి ఘటనలు అరుదుగా సంభవిస్తాయని గతంలో ఉత్తరాఖండ్‌లో జరిగిన టన్నెల్ ప్రమాదంలో కార్మికులను కాపాడిన రెస్క్యూ టీమ్ సాయంతో సొరంగ మార్గంలో చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడేందుకు ఏర్పాట్లు చేస్తున్నా మన్నారు.
అనుకోని పరిస్థితుల్లోనే భూమి పొర ల్లో ఏర్పడిన గ్యాప్ వల్ల కదలిక ఏర్పడి టన్నెల్ పైకప్పు ఊడి మట్టిదిబ్బలు నీటిఊట నుంచి బురదగా పేరుకుపోవడం వల్లే కార్మికులు చిక్కుకు న్నారని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ఎన్‌డీఆర్‌ఎఫ్, సైన్యం సహకారంతో సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
నీటిఊట అంశాన్ని రాజకీయం చేయాలనుకునే ప్రతిపక్షాలు వారి హయాంలోనే నిధులు విడుదల చేసి పనులు ఎందుకు చేయలేదని ప్రశ్నిం చా రు. దాని ఫలితంగానే ఈ ప్రమాదం సంభవించింద మండిపడ్డారు. ప్రమాద ఘటనపై ప్రతిపక్షాలు రాజకీ యం చేయాలనుకోవడం దురదృష్టకరమని మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాలుగు రోజుల కిందటే పనులు ప్రారంభం..
నల్గొండ ప్రాంతంలోని ఫ్లోరైడ్ భూతాన్ని పారదోలేందుకు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 2004లో 1,925 కోట్ల వ్యయంతో నల్గొండకు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో శ్రీశైలం ఎడమగట్టు నుంచి 45 కిలోమీటర్లు సొరంగం పనులు చేపట్టింది.
శ్రీశైలం ఎడమ గట్టు నుంచి 13 కిలోమీటర్లు, నల్గొండ ప్రాంతాల నుంచి 23 కిలోమీటర్ల సొరంగ మార్గ పనులు పూర్తి చేశారు. అనంతరం తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు నిర్మాణ పనులు పట్టించుకోలేదు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారం లోకి వచ్చిన తర్వాత రెండు నెలల క్రితం రూ.4,637 కోట్ల నిధులు కేటాయించి పను లు ప్రారంభించింది.
నాలుగు రోజుల కింద శ్రీశైలం ఎడమగట్టు సొరంగ మార్గంలోని 13వ కిలోమీటర్ వద్ద పనులు తిరిగి ప్రారంభించింది. నాలుగు రోజులుగా రెండు మీటర్ల సొరంగ మార్గా న్ని తవ్వకాలు పూర్తిచేయగా శనివారం ఉదయం టన్నెల్ బోరింగ్ మిష న్ సహాయంతో పనులు చేపడుతుండగా దగ్గర్లోని మూడు మీటర్ల పరిధిలో మట్టిదిబ్బలు కూలి నీటి ఊట పేరుకుపోయి బుర ద ప్రవాహం పెరిగింది. విషయాన్ని గుర్తించిన కొంతమంది కార్మికులు బయటకు పరుగులు తీయగా మరో ఎనిమిది మంది బురదలోనే చిక్కుకుపోయారు.
ప్రమాదానికి కారణాలు ఇవే..
ఐదేళ్ల కాలంగా ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో ఆ ప్రాంతంలో టన్నెల్ బిగించిన రాక్ బోల్ట్ నీటి ఊటకు మెత్తబడి ప్రస్తుతం చేపడుతున్న నిర్మాణ పనులకు భూమి కంపించడం వల్ల ప్రమాదం సంభవించినట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నీటిఊటను ఎప్పటికప్పుడు డీ వాటరింగ్ చేసేందుకు గత ప్రభుత్వం సుమారు రూ.29 కోట్లను మంజూరు చేయగా ఆ పనులు నత్తనడకన సాగడంతో రాక్ బోల్ట్‌లు మెత్తబడినట్లుగా చెబుతున్నారు. దీంతోపాటు జియాలాజికల్ సర్వే పూర్తి నివేదిక రాకముందే రక్షణ చర్యలు చేపట్టకుండా పనులు ప్రారంభించడంతోనే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రంగంలోకి ‘ఇంజినీర్ టాస్క్‌ఫోర్స్’
టన్నెల్ లోపల చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేసింది. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌కు సాయం చేసేందుకు సైన్యానికి చెందిన ‘ఇంజినీర్ టాస్క్‌ఫోర్స్’ రంగంలోకి దిగింది. స్థానిక యంత్రాం గంతో సమన్వయం చేసుకుంటున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని ఫోన్
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ ఆరా తీశారు. ఘటనకు సంబంధించి సీఎం రేవంత్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధానికి సీఎం వివరించారు.
సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్,జూపల్లి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని ప్రధానికి చెప్పారు. సహాయక చర్యల కోసం వెంటనే ఎన్టీఆర్‌ఎఫ్ టీమ్‌ను పంపిస్తామని, పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎంకు మోదీ భరోసా ఇచ్చారు.
ప్రమాద ఘటనపై సీఎం సమీక్ష
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో జరిగిన ఈ సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సాగునీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి హాజరయ్యారు.
ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటన, ప్రస్తుత పరిస్థితిపై పూర్తి వివరాలను సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరించారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యల్లో మరింత వేగం పెంచాలని సీఎం సూచించారు. గాయపడ్డ వారి పరిస్థితిని ఆరా తీసిన సీఎం, వారికి మెరుగైన వైద్యసాయం అందించాలన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభు త్వం అండగా ఉంటుందని భరోసా కల్పించాలన్నారు.
సహాయక చర్యలు చేపట్టే విషయం లో అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్ ఆర్డీఎఫ్ బృందాలు ప్రమాదస్థలికి చేరుకోకున్నాయని సీఎంకు మంత్రి ఉత్తమ్ వివరిం చారు. సొరంగంలో చిక్కుకున్న వారిలో ఇద్దరు జేపీ అసోసియేట్స్ కంపెనీ ఇంజినీర్లు, నలుగురు జార్ఖండ్ కు చెందిన కూలీలు, మరో ఇద్దరు అమెరికన్ కంపెనీ రాబింగ్ ఉద్యోగులు ఉన్నారని ఉత్తమ్ తెలిపారు. ప్రపంచంలోనే రాబిన్స్ కంపెనీకి మంచిపేరు ఉందని, సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడుతామని చెప్పారు.
కేంద్రం నుంచి సహాయం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
ఎస్‌ఎల్‌బీసీ దుర్ఘటనపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్‌లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు హోంమంత్రి అమిత్‌షాతో మాట్లాడిన కిషన్‌రెడ్డి.. ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలను పంపించాలని, కేంద్రం నుంచి అన్నిరకాల సహాయం అందించాలని కోరారు.
దీనికి కేంద్ర హోం మంత్రి సానుకూలంగా స్పందిం చారు. ఉత్తరాఖండ్ సిల్కారా సొరంగం కూలినప్పుడు సహాయక చర్యల్లో పాల్గొన్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాన్ని ఎస్‌ఎల్‌బీసీ వద్దకు పంపించాలని కిషన్‌రెడ్డి ఎన్డీఆర్‌ఎఫ్ డీజీ పీయూష్ ఆనంద్‌ను కోరగా ఆయన అందుకు అంగీకరించారు.
రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్: బండి సంజయ్
టన్నెల్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించుతున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్ అధికారులకు ఫోన్ చేసి ఘటనా స్థలికి బృందాలను తరలించాలని ఆదేశించారు. విజయవాడ నుంచి రెండు, హైదరాబాద్ నుంచి ఒక బృందం ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాలని ఎన్డీఆర్‌ఎఫ్ కమాండెంట్‌ను బండి సంజయ్ ఆదేశించారు.
ఈ ఘటన దురదృష్టకరం: మహేశ్‌కుమార్‌గౌడ్
ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే సీఎం రేవంత్‌రెడ్డి వేగంగా స్పందించి అన్ని రకాలుగా సహాయక చర్యలు తీసుకున్నారని తెలిపారు.
కాంగ్రెస్ అసమర్థతోనే ఈ ఘటన: హరీశ్‌రావు
ఎస్‌ఎల్‌బీసీ కూలడం కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనమని మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. శనివారం ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. చేయక చేయక ఒక ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి ఆరంభంలోనే అంతం చేసిన ఘనత కాంగ్రెస్ పాలకులదేనన్నారు. ప్రమాదంలో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడగా, మరికొంత మంది లోపలే ఉన్నట్లు తెలుస్తోందన్నారు. వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
ప్రమాదానికి సీఎందే బాధ్యత: కేటీఆర్
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదానికి పూర్తి బాధ్యత సీఎం రేవంత్‌రెడ్డిదేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సుంకిశాలలో రీటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటన మరువక ముందే మరో దుర్ఘటన జరగడం కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనమన్నారు. పైకప్పు కూలిన ఈ ఘటనలో చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టా లని సూచించారు.
కాంట్రాక్టర్లతో కుమ్మక్కు కమీషన్ల వేటలో పర్యవేక్షణను గాలికొదిలేయడం వల్లే ఇలాం టి ఘటనలు జరుగుతున్నాయని శనివారం ఎక్స్ వేదికగా విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక బ్యారేజీలో కేవలం పిల్లర్ కుంగితే నానా హంగామా చేసిన కాంగ్రెస్ నేతలు, తమ హయాంలో జరుగుతున్న వరుస వైఫల్యాలపై ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.