calender_icon.png 27 October, 2024 | 11:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండో విడతలో 25 మంది నెలాఖరులోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ!

10-08-2024 01:07:45 AM

మొదటి విడతలో 36 కార్పొరేషన్లకు చైర్మన్ల ప్రకటన 

రెండో విడతలో సీనియర్లు, పలువురు ఎమ్మెల్యేలకు అవకాశం 

రైతు కమిషన్ చైర్మన్‌గా కోదండరెడ్డి, విద్యా కమిషన్‌కు ఆకునూరి! 

బీసీ కమిషన్‌కు జీ నిరంజన్ పేరు పరిశీలన

ఆర్టీసీ చైర్మన్ పదవి ఎమ్మెల్యేకు ఇవ్వాలని నిర్ణయం

సీఎం నమ్మకస్తుడికే మూసీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి 

ఎస్ అశోక్

హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి) : నామినేటెడ్ పోస్టుల భర్తీపై సర్కారు ఫోకస్ పెట్టింది. మొదటి విడతలో 36 మందికి నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం, రెండో విడత 25 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పోస్టులకు కొందరి పేర్లను ఎంపిక చేసింది. మరికొన్నింటిపైన స్పష్టత వచ్చాక  ప్రకటించాలనే ఆలోచనతో  ఉన్నట్లుగా సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని ఈ నెల 14న రాష్ట్రానికి రానున్నారు.

ఆ తర్వాత నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి సారించనున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.  గత అసెంబ్లీ ఎన్నికల్లో  టికెట్ రాని వారితో పాటు పార్టీ కోసం మొదటి నుంచి  పనిచేసిన నాయకులకు పెద్దపీట వేయను న్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొద టి విడతలో భర్తీచేసిన వారిలో పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులకు దాదాపుగా అవకాశం ఇచ్చారు. రెండో విడత పార్టీ సీనియర్లకు అవకాశం ఉంటుందని చర్చ జరు గుతోంది. ప్రధానంగా విద్యా కమిషన్, రైతు కమిషన్, బీసీ కమిషన్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్, ఆర్టీసీ కార్పొరేషన్,  ఎంఎస్‌ఐడీసీ  మూసీ రివర్‌ఫ్రంట్  అభివృద్ధి సంస్థ తోపాటు ఆర్టీఐ, హెచ్‌ఆర్సీ తదితర నామినేటెడ్ పోస్టులను ఈ నెలాఖరులోగా భర్తీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  

రెండో విడత భర్తీ చేసే నామినేటెడ్ పోస్టుల్లో నియమించే వారిలో.. ఎమ్మెల్యేలు లేదా మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో టికెట్ రాని వారికి  అవకాశం కల్పిస్తారని చెబుతున్నారు. రైతు కమిషన్ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లుగా  తెలుస్తోంది. కోదండరెడ్డి పార్టీ కోసం మొదటినుంచి పనిచేయడమే కాకుండా  రైతు సమస్యలపై పూర్తిగా అవగాహన ఉండటంతో.. రైతు కమిషన్ చైర్మన్‌గా ఆయన్ను నియమించాలని నిర్ణయానికి వచ్చారు. ఇక విద్యా కమిషన్ చైర్మన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి  పేరు బలంగా వినిపిస్తోంది.

ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో.. విద్యా కమిషన్‌కు విశ్రాంత ఐఏఎస్‌ను నియమిస్తే బాగుంటుందనే ఆలోచనతో ఉన్నారు. ఇక ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఎమ్మెల్యేకు కట్టబెడుతారని చెబుతున్నారు. మంత్రివర్గ విస్తరణలో చోటుదక్కని వారికి అవకాశం ఇస్తారని చెబుతున్నారు. మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి సంస్థకు  మాత్రం సీఎం రేవంత్‌రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడినే ఎంపిక చేసే ఆలోచనతో ఉన్నట్లుగా సమాచారం.

మున్సిపల్ శాఖ సీఎం వద్దే ఉండటంతో పాటు.. మూసీని పూర్తిగా  ప్రక్షాళన చేయడమే తన డ్రీమ్‌గా  రేవంత్‌రెడ్డి  చెబుతున్న విషయం తెలిసిందే. మూసీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవిని నమ్మకమైన వ్యక్తికి అప్పగించాలనే ఆలోచనతో ఉన్నారు. ఇక  బీసీ కమిషన్ కాలపరిమితి కూడా ఈ నెలాఖరుతో ముగుస్తుంది. బీసీ కమిషన్‌కు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు జీ నిరంజన్ పేరు వినిపిస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నా  లేకున్నా పార్టీ కోసం నిబద్ధతతో నిరంజన్ పనిచేస్తుంటారు. నిరంజన్ మాత్రం తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.