calender_icon.png 27 April, 2025 | 10:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండే ఎండల్లో.. తాజాగా!

20-04-2025 12:00:00 AM

ఎండల్లో బయటకు వెళ్లి వచ్చిన తర్వాత వేడి నుంచి ఉపశమనం పొందడానికి కొంతమంది ఐస్‌క్యూబ్‌తో చర్మంపై రుద్దుకుంటూ ఉంటారు. అయితే దీనివల్ల కలిగే ఫలితం తాత్కాలికంగా ఉంటుంది. ఈ ఐస్‌క్యూబ్స్‌కు మరిన్ని సహజసిద్ధమైన పదార్థాలను జత చేస్తే అద్భుతమైన ఫలితాలు, ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయంటున్నారు సౌందర్య నిపుణులు. 

* పాలు చర్మానికి అవసరమైన తేమను అందించి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. అంతేకాదు.. మండే వేసవిలో చర్మానికి ఉపశమనం కలిగించడానికి కూడా బాగా ఉపకరిస్తాయి. 

* ఐస్ ట్రేలో పచ్చిపాలు పోసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఇవి క్యూబ్స్‌గా మారిన తర్వాత బయటకు వెళ్లి వచ్చిన వెంటనే ఒక మిల్క్ క్యూబ్‌తో చర్మంపై రుద్దుకోవాలి. 

* ఇలా క్రమం తప్పకుండా చేస్తే చల్లదనంతో పాటు, తగినంత తేమ కూడా అంది చర్మం తాజాగా కనిపిస్తుంది. కావాలనుకుంటే రోజూ రాత్రి పడుకొనే ముందు ఒక మిల్క్ క్యూబ్‌తో చర్మంపై మృదువుగా రుద్దుకొని మరుసటి రోజు ఉదయాన్నే చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. 

* చర్మాన్ని అందంగా ఉంచడంలో ముల్తానీ మట్టి కూడా ఒకటి. దీన్ని వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి కూడా వాడవచ్చు. ఇందుకోసం.. ముల్తానీ మట్టి ఒక చెంచా, రోజ్ వాటర్ నాలుగు చెంచాల చొప్పున తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో వేసి డీప్ ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. 

* ముల్తానీ క్యూబ్స్‌తో చర్మంపై మృదువుగా రుద్దుకొని పది నిమిషాలు లేదా పూర్తిగా ఆరే వరకు ఉండనిచ్చి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల ఎండనుంచి చర్మానికి రక్షణ లభించడం మాత్రమే కాదు.. చర్మం తాజాగా మారుతుంది.