calender_icon.png 24 October, 2024 | 1:54 PM

పదకొండేళ్లుగా ఒకే చోట!

09-08-2024 01:55:35 AM

  1. ముందుకు సాగని మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలు 
  2. షెడ్యూల్ విడుదల చేసి ఏడాది పూర్తి 
  3. పలు కేసులు కోర్టుల్లో ఉండటం వల్ల జాప్యం

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): ఆదర్శ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు దాదాపు పదకొండేళ్లుగా బదిలీలు లేకపోవడంతో వారు తీవ్ర మానసిక వేదనకు గురవు తున్నారు. అపాయింట్‌మెంట్ ఆర్డర్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు ఒకేచోట ఉద్యోగం చేస్తున్నారు. అనారోగ్య సమస్యలు, కుటుంబ అవసరాల నేపథ్యంలో తమకు బదిలీలు చేపట్టాలని ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే గతేడాది 2023 జూలై 3న వీరి బదిలీలకు షెడ్యూల్‌ను విడుదల చేసి ప్రక్రియను కూడా చేపట్టింది. కొంతమంది ఉపాధ్యాయులు పలు కారణాలతో కోర్టును ఆశ్రయించ డంతో ఆ ప్రక్రియకు అక్కడితో బ్రేక్ పడింది. షెడ్యూల్ విడుదల చేసి కూడా ఏడాది పూర్తవుతున్నా ఇంత వరకూ బదిలీలు జరగలేదు. 

కోర్టు కేసులతో బ్రేక్‌లు 

రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో సుమారు 2,800 మంది టీజీటీ, పీజీటీలతో పాటు ప్రిన్సిపాల్స్ పనిచేస్తున్నారు. 2011లో నోటిఫికేషన్ ఇచ్చి 2013, 2014లో నియామకాలు చేపట్టారు. అప్పుడు ఏ స్కూల్లోనైతే ఉద్యోగాలు పొందారో ఇప్పుడూ అక్కడే పనిచేస్తున్నారు. అయితే వీరిలో కొందరు 2013లో రిక్రూట్ అయిన తేదీనే పరిగణనలోకి తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించారు. దీనికితోడూ రోస్టర్ కమ్ మెరిట్‌ను పాటించలేదు. ఉమ్మడి ప్రభుత్వంలో అధికారులు టీచర్లను అస్తవ్యస్తంగా కేటాయించారు. తెలుగు, ఇంగ్లీష్, గణితం సబ్జెక్టులకు ఒక్కో స్కూల్‌లో ఇద్దరు టీచర్లను రిక్రూట్ చేసినా పోస్టింగ్స్ సమయంలో ఒక పోస్టునే నింపారు.

అలాగే ఒక్కో స్కూల్‌లో ఒకే సబ్జెక్టుకు రెండు పోస్టులకు ఎంపికైనా అవి భర్తీ చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది టీచర్లు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. అయితే దీని తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గతేడాది షెడ్యూల్ విడుదల చేసి బదిలీల ప్రక్రియను చేపట్టింది. కానీ 2014లో నియామకాలు పొందిన కొందరు 2013 నుంచే తమ సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకోవాలంటూ కోర్టు మెట్లు ఎక్కడంతో ఆ కేసు కోర్టులో నడుస్తోంది. సెకండ్ ఫేజ్‌లో అంటే 2014లో నియామకాలు పొందిన వారు సుమారు 1300 వరకు ఉంటారు. 317 జీవో అమలు కేసుకు సంబంధించి హైకోర్టు మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్, పీజీటీ, టీజీటీలకు 317 అమలు చేయాలని 2022 ఆగస్టు 29న జారీ చేశారు. అయితే దీనిపై ఇద్దరు టీచర్లు మోడల్ స్కూల్‌కు 317ను అమలు చేయొద్దని కోర్టుకు వెళ్లారు. దీంతో అప్పట్లో హైకోర్టు స్టే ఇచ్చింది. వాదనలు విన్న హైకోర్టు ఆ ఇద్దరిని మినహాయించి 317 అమలు చేసుకోవచ్చని తీర్పు ఇచ్చింది. దీంతో జోనల్, మల్టీ జోనల్ కేటాయింపులు, ఉద్యోగోన్నతులతోపాటు నూతన నియామకాలకు మార్గం సుగమమైనట్లయింది.

పదేళ్లుగా పట్టించుకోలేదు 

మోడల్ స్కూల్ వ్యవస్థను పదేళ్లుగా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. పదకొండేళ్లుగా ఒక్కసారి కూడా బదిలీలు లేక ఒకే చోట పనిచేయడం మోడల్ స్కూల్ వ్యవస్థలో స్తబ్ధత ఏర్పడింది. అన్ని మేనేజ్‌మెం ట్లలో బదిలీలు, ప్రమోషన్లు జరిగాయి. కానీ మోడల్ స్కూళ్లలో టీచర్లకు బదిలీలు చేపట్టలేదు. ప్రభుత్వం 2800 మంది ఉపాధ్యాయుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని తర్వగా నిర్ణయం తీసుకోవాలి.

 బీ కొండయ్య, 

తెలంగాణ మోడల్ స్కూల్ 

టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు

జడ్జిమెంట్ వచ్చేలా చొరవ తీసుకోవాలి 

317 జీవో కేసు క్లియర్ అయినందున మిగిలిన బదిలీల కేసు జడ్జిమెంట్ వచ్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అలకేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.

 యాకమల్లు, 

టీఎంఎస్‌టీఏ అధ్యక్షుడు