calender_icon.png 20 March, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీవో కార్యాలయంలో.. మధ్య దళారుల రాజ్యం?

20-03-2025 12:06:50 AM

 -అవినీతి, అక్రమాలకు కేంద్రంగా ఆర్టీవో ఆఫీసు .. నేరుగా వస్తే నిబంధనల పేరుతో ఇబ్బందులు ..

- ఏజెంట్లు ద్వారా వస్తే నిమిషాల్లో పనులు ..

- అవినీతి, అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకు పలు శాఖలకు నెలనెలా మామూలు..?

 -అవినీతి అక్రమాలు జరిగిన కన్నెత్తి చూడని నిఘా విభాగం అధికారులు..?

సంగారెడ్డి, మార్చి 19 (విజయ క్రాంతి): రవాణా శాఖ కార్యాలయలు అవినీతికి నిలయంగా మారిపోతున్న, అధికారులు అవి నీతిని నిర్మూలించడం లేదు. మధ్య దళారులు లేనిది ఆర్టీవో కార్యాలయంలో ఏ పని జరగడం లేదు. చిన్న వాహనం నుంచి భారీ వాహనాల వరకు రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్లు అందజేస్తారు. వీటితోపాటు డ్రైవింగ్ లైసెన్స్ లో ఇస్తారు. ప్రభుత్వానికి రవాణా శాఖ ద్వారా ప్రతినెల భారీగాని ఉదయం వస్తుంది.

ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు ఆర్టీవో కు, ఎంవీఐ లకు భారీగానే ప్రతిరోజు ఆదాయం వస్తుంది. రవాణా శాఖ కార్యాలయంలో పనిచేసే సాధారణ ఉద్యోగి తో పాటు ఏజెంట్లు భారీగానే డబ్బులు సంపాదిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఆర్టీవో కార్యాలయం తో పాటు సంగారెడ్డి, పటాన్ చెరు, జహీరాబాద్ పట్టణంలో యూనిట్ కార్యాలయాలు ఉన్నాయి. యూనిట్ కార్యాలయంలో ఎంవీఐలు విధులు నిర్వహిస్తారు. సంగారెడ్డి జిల్లాలో ఉన్న రవాణా శాఖ కార్యాలయాలు అవినీతి, అక్రమాలు పెరిగిన అధికారులు నివారించడంలో విఫలమవుతున్నారు.

సంగారెడ్డి జిల్లాలో పనిచేసేందుకు రాష్ట్రస్థాయిలో పైరవీలు చేసుకుని జిల్లాకు రాగానే భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. పోస్టింగ్ ల కోసం లక్షలు ఇచ్చి ఇక్కడికి రావడంతో అక్రమంగా డబ్బులు సంపాదించాలని ఏజెంట్లను నియమించుకొని వసూలు చేస్తున్నారని తెలిసింది. రవాణా శాఖ కార్యాలయం అవినీతి అక్రమాలు పెరిగిన నివారించడంలో ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి.

ఏజెంట్లకు అడ్డగా రవాణా శాఖ కార్యాలయాలు..?

సంగారెడ్డి జిల్లాలో రవాణా శాఖ కార్యాలయాలు ఏజెంట్లకు అడ్డగా మారాయని విమర్శలు వస్తున్నాయి. రవాణా శాఖ యూనిట్ కార్యాలయాల్లో ఏజెంట్ లేనిది ఏ పని జరగడం లేదు. సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్ చెరు యూనిట్ కార్యాలయంలో వాహనాల రిజిస్ట్రేషన్, లెర్నింగ్ లైసెన్స్, (ఎల్‌ఎల్‌ఆర్), పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్, లైసెన్స్ రెన్యువల్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్, లైసెన్స్ లో పేరు మార్పు, చిరునామా మార్పు కోసం ప్రతిరోజు ప్రజలు అక్కడికి వెళుతుంటారు.

కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్, ఆర్సి ట్రాన్స్ ఫర్, వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్, వాహనాల ఆర్సీలు పోయినప్పుడు డూప్లికేట్ ఆర్సిలు మంజూరు చేయడం, పన్నులు, ఫీజుల చెల్లింపు, రోడ్ టాక్స్, గ్రీన్ టాక్స్, పెనాల్టీ చెల్లింపులు, అనుమతులు సర్టిఫికెట్ల జారీలు చేస్తారు. వాణిజ్య వాహనాలకు పర్మిట్ అనుమతిస్తారు. టూరిస్టు వాహనాలకు తాత్కా లిక అనుమతులు పర్మిట్ ఇస్తారు. రవాణా శాఖ యాక్ట్ ప్రకారం పలు సేవలు కార్యాలయంలో అందిస్తారు. పనుల కోసం కార్యాల యానికి నేరుగా వెళ్లిన ఆర్టిఏ అధికారులు నిబంధనల పేరుతో రిజెక్ట్ చేస్తారు.

అదే ఏజెంట్ ద్వారా వెళితే ఎలాంటి నిబంధనలు లేకుండా పనులు చేసి పెడుతున్నారు. ఆర్టిఏ ఏజెంట్లు పనుల కోసం వచ్చే వారి నుంచి భారీగానే డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇంత డబ్బు ఎందుకు ఇవ్వాలని ఎవరైనా ప్రశ్నిస్తే అధికారులకు ఇవ్వాల్సి ఉంటుందని బహిరంగంగా సమాధానం ఇస్తున్నారు.

ప్రతిరోజు ఆర్టీవో కార్యాలయాల వద్ద రూ. లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఆర్టీవో అధికారి విధులు నిర్వహిస్తున్నారు. యూనిట్ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు పనిచే స్తున్నారు. ప్రతిరోజు కార్యాలయంలో అవినీతి, అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఏ ఒక్క వాహనదారుడికి నేరుగా పని జరగదు. ఏజెంట్ ద్వారా వెళితేనే పనులు జరుగుతున్నాయి. 

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులదే హవా...?

రవాణా శాఖ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులదే హవా నడుస్తోంది. రవాణా శాఖ లో ఆన్ లైన్ విధానం అమల్లో ఉన్న ఏజెంట్లు లేనిది పని జరగడం లేదు. ప్రతి ఆఫీసులో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ వరకు ప్రతి పని ఏజెంట్ లేనిది నడవడం లేదు. ఒక డ్రైవింగ్ లైసెన్స్ వద్ద ఏజెంట్లు అదనంగా రూ.2 వేలు వసూలు చేస్తున్నారు. ఏజెంట్ వసూలు చేసిన డబ్బులను సాయంత్రం కాగానే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు అప్పగిస్తున్నట్టు తెలిసింది.

ప్రతిరోజు భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ఏసీబీ అధికారులు ఏ ఒక్క కార్యాలయం పైన నిఘా పెట్టలేదని విమర్శలు వస్తున్నాయి. వాహనాలలో భారీగా అక్రమంగా అధిక లోడు తరలిస్తున్న కేసులు నమోదు చేయడం లేదు. జాతీయ రహదారులు, ప్రధాన రహదారులపై వాహనాల తనిఖీ పేరిట భారీగానే డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వాహనాల తనిఖీ సమయంలో ఏజెంట్లీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఏజెంట్లు కార్యాలయంలో దర్జాగా తిరుగుతూ పనులు చేస్తున్నారు.

పనులను బట్టి ధర నిర్ణయించి వసూలు చేస్తున్నారు. రవాణా శాఖ అధికారులు, ఏజెంట్లు సమన్వయంతో పనిచేసి అక్రమాలకు పాల్పడు తున్నారు. అవినీతి, అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకు ప్రతినెల రాజకీయ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు, నిఘా విభాగం అధికారులకు, పర్యవేక్షణ చేసే అధికారులకు ప్రతినెల భారీ మొత్తంలో డబ్బులు అప్పగిస్తున్నట్టు తెలిసింది.

ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. జిల్లాలో ఉన్న రవాణా శాఖ కార్యాలయాలపై విచారణ చేపట్టి అవినీతి అక్రమాలు నివారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రవాణా శాఖ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై జిల్లా రవాణా శాఖ అధికారి వివరణ కోసం ఫోన్ చేయగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు.