జాన్వీ కపూర్ నటిగా బిజీ అవుతోంది. శ్రీదేవి తనయురాలిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టినా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు శ్రమిస్తోందీ భామ. ‘తిను ధడక్’ అనే హిందీ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన ఈ అమ్మడు ఇటీవలే ‘దేవర’తో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే ఆమెకు దక్షిణాదిలో అవకాశాలు పెరిగాయి.
ప్రస్తుతం రామ్ చరణ్ సరసన ఓ సినిమా చేయనుండగా, కోలీవుడ్‌లోనూ ఓ భారీ చిత్రంలో జాన్వీని కథానాయికగా అనుకుంటున్నట్టు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘ఈరం’ చిత్రం హిందీ రీమేక్‌లో జాన్వీ నటించనుందని సమాచారం. ఆమెతో చిత్ర దర్శకనిర్మాతలు మంతనాలు సాగిస్తున్నారట.
2009లో తెలుగులో ‘వైశాలి’ టైటిల్‌తో ఈ చిత్రం విడుదల కాగా.. ఆది పినిశెట్టి, సింధు మేనన్, శరణ్య మోహన్, నంద ప్రధాన పాత్రలు పోషించారు. 15 ఏళ్ల తర్వాత దీన్ని హిందీలో రీమేక్ చేసేందుకు మనోజ్ పరమహంస యత్నిస్తున్నారు. ఛాయాగ్రాహకుడిగా మంచి పేరున్న మనోజ్ ఈ సినిమాతో దర్శకుడిగా మారనున్నారు. హిందీ ప్రేక్షకులకు నచ్చేలా మార్పులు చేర్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని టాక్.