- బడికి బడి, గుడికి గుడి మాట మరిచిన గత ప్రభుత్వం
- మల్లన్నసాగర్ ఇంకా మునగని భూములు, ఆలయాలు
- పండుగలకు ఏ గుడికి వెళ్లాలో అర్థంకాని ప్రజలు
- పరిహారం ప్యాకేజీల కోసం పునరావాసులు ఎదురుచూపులు
- గజ్వేల్, జనవరి 10 : ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు పలు ప్రాంతాల రైతులకు సాగునీటిని అందిస్తామంటూ ప్రతిష్టాత్మ కంగా గత ప్రభుత్వం నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్లో ముంపుకు గురైన గ్రామాలకు ఇంకా పరిహారం అందని ద్రాక్షలాగే మిగిలింది. గ్రామాలను ఖాళీ చేసే సమయంలో ఆయా గ్రామాల ప్రజలకు ఇళ్లుకు ఇళ్లు, బడికిబడి, గుడికి గుడితో పాటు పెళ్లి అయిన వారికి, కాని వారికి ప్రత్యేక ప్యాకేజీలను గత ప్రభుత్వం ఇస్తామని చెప్పింది.
- దీనిలో ఇంకా ప్యాకేజీలు, ప్లాట్లు అందక గజ్వేల్ పట్టణం లోని డబుల్ బెడ్రూం ఇండ్లలోనే ఎదురు చూపులు చూస్తున్నారు. పరిహారాలు ఇస్తేనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఖాళీ చేస్తామని ముంపు బాధితులు పరిహారం కోసం భీష్మించుకు కూర్చున్నారు. ముంపు బాధితులకు పరిహారంలో భాగంగా ఇండ్లు, ప్లాట్లు, బడులు, అంగన్వాడీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆయా గ్రామాల్లో ఆలయాలు మసీదులు చర్చిలో ఏర్పాటును గాలికి వదిలేసింది.
- గజ్వేల్ రెవెన్యూ పరిధిలోని ముట్రాజ్ పల్లి, సంగాపూర్ ప్రాంతంలో నిర్మించిన మల్లన్న సాగర్ పునరావాస కాలనీలో 10 గ్రామాల ప్రజలు ప్రస్తుతం గ్రామాల వారీగా నివసిస్తున్నారు. అవసరం లేకున్నా తమ గ్రామాల భూములను తీసుకు న్నారని, గ్రామాల్లోని తమ విలువైన భూములు ఆలయాలు కూడా మల్లన్న సాగర్ లోనే ఉండిపోయాయని ఇప్పటికీ ముంపు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- ఇప్పటికీ మలన సాగర్లో నీటి చుక్క కూడా తగలరని వందల ఎకరాల భూమి వృధాగానే ఉన్నది. మరణ సాగర్ లో అడుగుపెడితే నీటములుగాకుండా ఉన్న భూముల్లో ఆలయాలు ఇప్పటికీ స్పష్టంగా కనబడుతున్నాయి.
అక్కడ మొక్కులు.. ఇక్కడ జాతరలు..
వేములఘట్, పల్లెపహడ్, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామాల్లో ప్రజలు వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఆలయాల వద్ద ప్రతి ఏడాది జాతరలు చేస్తుండే వారు. ఇప్పుడు తమ గ్రామాల్లోని ఆలయాల వద్ద కొబ్బరికాయలు కొట్టి వచ్చి ఇక్కడ జాతరలు జరుపుకుంటున్నారు. దేవుడు లేని జాతరలతో బాధను దిగమింగే ఒకొకరికరు శుభాకాంక్షలు తెలుపు కుంటూ సంబరపడుతున్నారు.
ఏటిగడ్డ కిష్టాపూర్ పరిధిలోని వాగుగడ్డ హనుమాన్ ఆలయం మల్లన్నసాగర్ బయట ఉండగా, గ్రామం మల్లన్నసాగర్ లో ముంపుకు గురైంది. దీంతో ఆ గ్రామ ప్రజలు జాతరను రెండురోజుల పాటు జరుపు కుంటూ మొదటి రోజు వాగుగడ్డ వద్ద, రెండోరోజు గజ్వేల్లోని పునరావాస కాలనీ లో జాతర జరుపుకుంటున్నారు.
పండుగలకు ఏ గుడికి వెళ్లాలో అర్థంకాని ప్రజలు
ఐడేండ్లుగా గజ్వేల్ ప్రాంతంలోని పునరావాస కాలనీలో నివాసం ఉంటున్న ప్రజలు పండుగల సమయాల్లో ఏ గుడికి వెళ్లాలో అర్ధం కాక తమ గ్రామంలో జరుపుకున్న జాతరలు, వేడుకలు, పండుగలను తలుచుకుంటూ బాధ పడుతు న్నారు. గ్రామదేవతలైన పోచమ్మ, మైసమ్మ, కులదేవతలైన పెద్దమ్మ, దుర్గమ్మ, ప్రధాన ఆలయాలైన వెంకటేశ్వరస్వామి, హనుమాన్ ఆలయాలు ఎన్నో ముంపుకు గురైన పది గ్రామాల్లో ఉన్నాయి.
ఒక్కో గ్రామంలో 8 నుండి 25 ఆలయాల వరకు ఉండగా, ఆయా కులాల ప్రజలు తాము పూజించుకునే దైవాలకు ఆలయాలకు కూడా నోచుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాల పరిహారాన్ని కూడా చెల్లిస్తామన్న అధికారులు మెల్లి మెల్లిగా రోజులు గడుపుకుంటూ వెళ్లడంతో ప్రభుత్వాలే మారిపోయాయి. ఇప్పటికైనా తమ గ్రామాలలో ఆలయాల నిర్మాణానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు.
పలు గ్రామాల్లో పదుల సంఖ్యలో పరిహారం అందని ప్రజలు ఇంకా తమ ప్యాకేజీలు, ప్లాట్ల కోసం గజ్వేల్ ప్రజల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలోనే ఎదురుచూపులు చూస్తున్నారు. ఇటు ప్రజలతో పాటు దేవుళ్లకు పునరావాసంలో న్యాయం జరగకపోవడం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది.