calender_icon.png 10 January, 2025 | 12:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్రరాజ్య రాజకీయాల్లో తూటా!

16-07-2024 12:00:00 AM

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నంతో ప్రపంచం యావత్తు ఒక్క సారిగా ఉలిక్కి పడింది. పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మాట్లాడుతుండగా ఓ యువకుడు కాల్పులు జర పడంతో ఆయన చెవికి తీవ్ర గాయమయింది. త్రుటిలో ఆయన మృత్యువు నుంచి తప్పించుకున్నారు. ట్రంప్‌పై కాల్పుల ఘటనను అధ్యక్షుడు జో బైడెన్ మొదలుకొని ప్రపంచ దేశాల నేతలందరూ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన జరిగిన సమయంలో సభలో ఉన్న తూటా తగిలి ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన యువకుడ్ని సీక్రెట్ సర్వీస్ ఏజంట్లు మట్టుబెట్టారు. నిందితుడిని 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్‌గా గుర్తించిన ఎఫ్‌బీఐ తాజాగా అతడి ఫొటోను కూడా విడుదల చేసింది. క్రూక్ రిపబ్లికన్ పార్టీ మద్దతుదారుగా నమోదు చేసుకున్నట్లు చెబుతున్నారు.

అయితే అతను డెమోక్రటిక్ పార్టీ అనుబంధ సంస్థకు కూడా విరాళం ఇచ్చినట్లు తెలుస్తోంది. బెతెల్ పార్క్ స్కూల్‌నుంచి 2022లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన క్రూక్స్ చురుకైన విద్యార్థిగా గుర్తింపు పొందినట్లు సమాచారం. అయితే స్కూల్లో ఉన్నప్పుడు క్రూక్స్ తోటి విద్యార్థులనుంచి వేధింపులు ఎదుర్కొన్నాడని, ఫలితంగా అతను ఎప్పుడూ మౌనంగా, ఒంటరిగా ఉండేవాడని మాజీ క్లాస్‌మేట్ ఒకరు చెప్పారు. ఇదే అతను ట్రంప్‌పై కాల్పులు జరపడానికి దారి తీసి ఉంటుందని భావిస్తున్నప్పటికీ అసలు కారణం ఏమిటో ఇంకా తెలియరాలేదు. ట్రంప్‌పై తూ టాల వర్షం కురిపించడానికి క్రూక్స్ వాడిన ఏఆర్15 రైఫిల్‌కు సామూహిక జన హనన ఆయుధంగా పేరుంది.

అత్యంత శక్తివంతమైన ఈ ఆర్మాలైట్15 తుపాకీ సెమీ ఆటోమేటిక్ ఆయుధం, కచ్చితత్వానికి పెట్టింది పేరని అంటారు. తుపాకీతో క్రూక్స్ భవనంపైకి ఎక్కి పొజిషన్ తీసుకోవడాన్ని కొంతమంది పోలీసులు గమనించినా అతని చేతిలో తుపాకీనిచూసి భయపడ్డారని చెబుతున్నారు. ట్రంప్ పాల్గొన్న సభలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లుగా కనిపి స్తున్నదని సీక్రెట్ సర్వీస్ అధికారులు అంటున్నారు. తాను బతికి బైటపడడం అంతా భగవంతుడి దయేనని, నిజానికి తాను చనిపోయాననే అనుకున్నానని దాడి అనంతరం ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ ట్రంప్ వ్యాఖ్యానిం చారు. అయితే ఇదంతా ఓ ప్లాన్ ప్రకారం జరిగిందేనన్న కథనాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

అయితే అసోసియేట్ ప్రెస్ ఫొటోగ్రాఫర్ ఘటన సమయంలో తీసిన ఓ ఫొటో మొత్తం అమెరికా రాజకీయాలనే మార్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పిడికిలి బిగించిపైకెత్తిన చేయి, వెనుక అమెరికా జెండా, చుట్టూ సీక్రెట్ సర్వీస్ ఏజంట్ల మధ్య ముఖమంతా రక్తంతో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఫొటో ఇప్పుడు ఆ పార్టీ ప్రచారాస్త్రమయింది. రెండు రోజుల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్‌ను అధికారికంగా ప్రకటించనున్న తరుణం లో దేశానికి కావలసింది ఇలాంటి యోధుడేనంటూ పార్టీ వాళ్లు ఇప్పటికే ప్రచారం కూడా మొదలెట్టేశారు. మతిమరుపుతో పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తున్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ను పోటీనుంచి ఎలా తప్పించాలని ఇప్పటిదాకా ఆ పార్టీ నేతలు తలలు పట్టుకొంటున్నారు.

ఈ తరుణంలో జరిగిన ఈ ఘటన ట్రంప్ విజయావకాశాల ను గణనీయంగాపెంచేసిందని సామాజిక మాధ్యమాలు అంచనా వేస్తున్నా యి. ఒపీనియన్ పోల్స్ కూడా ఆయన అవకాశాలను అమాంతంగా పెంచేశాయి. శ్వేతసౌధంలో మళ్లీ ట్రంప్ కూర్చోవడం ఖాయమన్న రాజకీయ విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. ఇప్పటికే 70 శాతానికి చేరుకున్న ఆయన విజయావకాశాలు రానున్న రోజుల్లో మరింత మెరుగుపడుతాయని రిపబ్లికన్లు అంచనా వేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో అమెరికా రాజకీయాలు ఎ లాంటి మలుపు తిరుగుతాయో వేచి చూడాలి. ప్రపంచానికి ‘పెద్దన్న’గా ఉండే తమ దేశాన్ని పాలించే వ్యక్తి ఎలాంటి వాడయి ఉండాలో అమెరికన్లు నిర్ణయించుకోవలసిన తరుణం ఆసన్నమైందని పరిశీలకులు భావిస్తున్నారు.