చిత్ర పరిశ్రమలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ శనివారం స్పందించారు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అవడం గురించి మాట్లాడారు. “తాజాగా సినీ ప్రముఖులంతా ప్రభుత్వాన్ని కలిశారు. ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ వచ్చిందనే అపోహ ఈ మీటింగ్‌తో తొలగిపోయింది. అక్కడికి వెళ్లినవాళ్లంతా అది బెస్ట్ మీటింగ్ అని నాకు చెప్పారు.
గతంలోనూ మేము కొన్ని చిత్రాలకు ప్రీమియర్ షోలు వేశాం. అయితే వాటిని ఉచితంగా ప్రదర్శించాం. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. బెనిఫిట్ షోలు ఉచితంగా ప్రదర్శించడంపై అందరూ ఆలోచించాలి. తాజాగా ‘పుష్ప 2’ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందంటే మనం ఇప్పటికే ఇంటర్నేషనల్ స్థాయికి చేరాం. ఇండస్ట్రీ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి మరింత సహకారం కోరడానికి వెళ్లారే తప్ప మీటింగ్‌లో వాళ్లు సినిమాల గురించి మాట్లాడలేదు.
ప్రభుత్వం చేపట్టే అవగాహన కార్యక్రమాలన్నింటినీ మన హీరోలందరూ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అలా చేయడం మన విధి. సినిమాతో డబ్బులు సంపాదించుకుంటున్నప్పుడు సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడే వీడియో చేయడంలో తప్పు లేదు. సినిమాల రిలీజ్ సమయంలోనే కాకుండా ఎప్పుడూ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి.
లంచం తీసుకుని టికెట్ ధరలు పెంచారని వచ్చిన వార్తలపై ఇండస్ట్రీ ప్రముఖులతో సీఎం మాట్లాడినట్టు సమాచారం. చిరంజీవి కుటుంబం ఈ మీటింగ్‌కు ఎందుకు వెళ్లలేదో నాకు తెలియదు. వారికేమైనా పనులు ఉండి ఉండొచ్చు. అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు సంతోషించా. అలాగే సంధ్య థియేటర్ ఘటనపై కూడా నా అభిప్రాయాన్ని చెప్పా. నా ఉద్దేశం బాధ పెట్టడం కాదు. కొందరి మాట వింటే భవిష్యత్ బాగుంటుంది. కొందరికి దూరంగా ఉంటే మంచిది” అని తమ్మారెడ్డి పేర్కొన్నారు.