calender_icon.png 31 October, 2024 | 12:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివలోకం పేరుతో భార్యాపిల్లలను ఎడబాపారు !

13-07-2024 05:01:54 AM

  • బాధ్యులైన ఇద్దరు మహిళలపై చర్యలు తీసుకోవాలి 
  • కరీంనగర్‌లో కన్నీటి పర్యంతమైన బాధితుడు 

 కరీంనగర్, జూలై 12 (విజయక్రాంతి): శివలోకం పేరుతో ఓ మహిళ భార్యతో పాటు పిల్లలను భర్తకు దూరం చేసింది. దీనిపై శుక్రవారం కరీంనగర్ ప్రెస్‌క్లబ్‌లో భర్త మల్లేశ్ తన గోడు వెళ్లబోసుకున్నాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం సూరా రానికి చెందిన మల్లేశ్, భాగ్య దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు స్మైలీ, రక్షిత. వీరి కుటుంబం హాయిగా జీవిస్తుండగా.. కొంతకాలం క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం ముత్యాలపాడుకు చెందిన కృష్ణవేణి బాతులు కాసుకుంటూ సూరారానికి వచ్చింది. మల్లేశ్ ఇంటి సమీపంలో అద్దెకు దిగింది. కృష్ణవేణికి భాగ్యతో స్నేహం కుదిరింది. కొంతకాలం తర్వాత కృష్ణవేణి తన స్వగ్రామానికి వెళ్లింది. దీంతో భాగ్య ఫోన్‌లో కృష్ణవేణితో మాట్లాడేది. కృష్ణవేణి ఆమెను మాటల్లో పెట్టి తమ గ్రామానికిచెందిన అంకమ్మ గురించి చెప్పింది.

అంకమ్మ రంగంలోకి దిగి శివలోకం పేరుతో భాగ్యను మాటలతో బురిడీ కొట్టించింది. గత జన్మలో భాగ్య భర్త శివుడని, అంకమ్మ భాగ్యకు సోదరి అవుతుందని నమ్మించింది. అంకమ్మ మాటలు నమ్మిన భాగ్య కొద్దిరోజుల క్రితం భాగ్య ఇద్దరు కుమార్తెలతో కలిసి ఏపీలోని ముత్యాలంపాడుకు వెళ్లింది. మల్లేశ్ ఆ గ్రామానికి వెళ్లి భార్యను సొంతఊరికి రమ్మని చెప్పినా ఆమె వినలేదు. తన భర్త శివయ్య అని, మల్లేశ్ ఎవరో తెలియనట్లు భాగ్య మాట్లాడింది. దీంతో మల్లేశ్ అక్కడి పోలీసులను ఆశ్రయించాడు. అయినప్పటికీ ప్రయోజనం లేదు. తన భార్యాపిల్లలను విడదీసిన కృష్ణవేణి, అంకమ్మపై చర్యలు తీసుకోవాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ని వేడుకుంటున్నాడు.