- వృద్ధుడి వద్ద రూ.10.50 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- సైబర్ క్రైం పోలీసులకు బాధితుడి ఫిర్యాదు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 31 (విజయక్రాంతి): స్టాక్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే అధిక మొత్తాల్లో లాభాలు పొందవచ్చని ఓ రిటైర్డ్ ఉద్యోగిని మాయమాటలతో నమ్మించి నిండా ముంచేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి(62) స్టాక్ ట్రేడింగ్ గురించి ఫేస్‌బుక్‌లో ఒక ప్రకటన చూశాడు. ఆ లింక్‌పై క్లిక్ చేయడంతో 113 మంది సభ్యులు కలిగిన ‘మల్టిపుల్ ఎంఏఎం క్లబ్ బీ51’ అనే వాట్సాప్ గ్రూప్‌లో తన ప్రమేయం లేకుండానే చేరాడు. ఈ క్రమంలో గ్రూపులోని మిగతా సభ్యులు తాము స్టాక్ ట్రేడింగ్ చేసి అధిక లాభాలు పొందుతున్నట్లు స్క్రీన్ షాట్లు పెట్టడంతో ఇదంతా నిజమేనని నమ్మిన బాధితుడు పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు.
మొదట్లో పెట్టిన పెట్టుబడులకు అధిక మొత్తాల్లో లాభాలు రావడంతో స్కామర్లు సూచించిన విధంగా పలు దఫాలుగా మొత్తం రూ.10.53 లక్షలను స్టాక్ ట్రేడింగ్‌లో పెట్టాడు. అనంతరం స్కామర్ల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు శనివారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ డీసీపీ దారా కవిత మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్ జరిగినట్లు గుర్తించిన బాధితులు ఆ డబ్బును తిరిగి పొందాలంటే (గొల్డెన్ అవర్) గంటలోపు ఆన్‌లైన్‌లో మెయిల్ ద్వారా.. ఫిర్యాదు ఐడీ. cybercrime.gov.in, టోల్ ఫ్రీ నం.1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.