calender_icon.png 1 October, 2024 | 12:50 PM

ప్రీ లాంచ్ పేరుతో కోట్లకు పడగలు

01-10-2024 01:38:42 AM

  1. కలర్‌ఫుల్ బ్రోచర్లు, హోర్డింగ్స్‌తో గాలం 
  2. ఖాళీ స్థలాలు చూపించి అరచేతిలో వైకుంఠం
  3. రూ.కోట్లలో వసూళ్లు.. తర్వాత బోర్డు ఫిరాయింపు
  4. పెట్టుబడులు పెట్టిన వారికి శఠగోపం
  5. ఇవీ.. ‘సాహితీ ఇన్‌ఫ్రా’ ఎండీ లీలలు
  6. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్..రిమాండ్‌కు తరలింపు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): ప్రీ లాంచింగ్ ఆఫర్ల పేరు తో ‘సాహితీ ఇన్ ఫ్రా డెవలపర్స్’ వేలాది మందిని మోసం చేసి సుమారు రూ.1,800 కోట్లు  వసూలు చేసి, బోర్డు తిప్పేశారనే ఆరోపణలపై సంస్థ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

మనీ లాండరింగ్ ఆరోపణలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయన కేసు నమో దు చేసి దర్యాప్తు  చేపడుతున్నది. దీనిలో భాగంగానే ఆదివారం ఆయన్ను అదుపులో కి తీసుకున్నది. ఆయన విచారణకు సహకరించడం లేదని, విచారణ నిమిత్తం తమకు కస్టడీ ఇవ్వాలని ఈడీ  నాంపల్లి స్పెష్టల్ కోర్టును ఆశ్రయించింది.

ఇరువైపులా వాదనలు విన్న నాంపల్లి కోర్టు తీర్పును రిజర్వ్ చేసి, నిందితుడికి 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నిందితుడిని చంచల్‌గూడ జైలు కు తరలించారు.  సంస్థను నమ్మి మోసపోయామని 2022లోనే బాధితులు పోలీసు లను ఆశ్రయించారు.

ఈ కేసులో నాడు నిందితుడితో పాటు మరో 22 మంది అరెస్టయ్యారు. అప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉన్నది. కేసును సీరియస్‌గా విచారించిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు  ఇప్పటికే సంస్థకు చెందిన రూ.200 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. 

ఈ ప్రాంతాల్లో..

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో సంస్థ 23 ఎకరాల్లో 32 ఫ్లోర్లతో 10 టవర్లు నిర్మిస్తున్నామని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దీంతోపా టు నానక్‌రామ్‌గూడలో సాహితీ స్వాద్ పేరు తో రూ.65 కోట్లు, మేడ్చల్‌లో సిస్టా అడోబ్ పేరుతో రూ.73 కోట్లు, కొంపల్లిలో సాహితీ గ్రీన్ పేరుతో రూ.40 కోట్లు, గచ్చిబౌలిలో సాహితీ సితార పేరుతో రూ. 135 కోట్లు, బం జారాహిల్స్‌లో సాహితా మెహ పేరుతో రూ. 44 కోట్లు, నిజాంపేటలో ఆనంద ఫార్చ్యూన్ పేరుతో రూ.45 కోట్లు, మోకిలాలో సాహితీ కృతి పేరుతో రూ.16 కోట్లు, బాచుపల్లిలో సాహితీ సుదీక్ష పేరుతో రూ.22 కోట్లు వసూ లు చేసినట్లు సీసీఎస్ పోలీసుల విచారణలో బహిర్గతమైంది.

వీటిలో ప్రధానంగా మూడు ప్రాజెక్టుల పేరుతో బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బును సంస్థ ఎండీ లక్ష్మీనారాయణ వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నాడని వెల్లడైంది. బాధితులు సంస్థ ప్రతినిధులను నిలదీయగా తాను టీటీడీ బోర్డు మెంబర్ అని, రాజకీయంగా తనకెంతో పలుకుబడి ఉందని వారిని బెదిరించాడనే ఆరోపణలు ఉన్నాయి.

మోసం జరిగింది ఇలా..

మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు స్థలాలు, ఫ్లాట్లు, విల్లాలు ఇస్తామంటూ ఆకర్షించింది. అందుకు ప్రత్యేకంగా మార్కెటింగ్ టీంను నియమించి కస్టమర్లకు గాలం వేసింది. సంస్థ ప్రతినిధులు గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతాల్లోని కొన్ని ఖాళీ స్థలాలను చూపించి ఒక్కో వ్యక్తి నుంచి రూ.50 లక్షలు మొదలుకొని రూ. 2 కోట్ల వరకు వసూలు చేశారు. 

అలా సుమారు 3 వేల మంది బాధితులు రూ.1,800 కోట్లు చెల్లించారు. వారికి నమ్మకం కలిగించేందుకు సంస్థ చెక్కులు, బాండ్ పేపర్లు (ఎంఓయూ) సైతం ఇచ్చిం ది. సంస్థ తర్వాత టవర్లు, అపార్ట్‌మెంట్లు, ఫ్లాట్లు నిర్మించకపోవడంతో తాము మోసపోయామని బాధితులు గుర్తించా రు. కాగా, ఇప్పటి వరకు సంస్థపై మొత్తం ౫౦ కేసులు నమోదయ్యాయి.