బాధితుడి నుంచి 28.45 లక్షలు స్వాహా
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 1 (విజయక్రాంతి): నగరానికి చెందిన ఓ వ్యాపారి నుంచి రూ. 28.45 లక్షలు స్వాహా చేశారు సైబర్ నేరగాళ్లు. ఇందుకు సంబంధించి సైబర్ క్రైం పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికి టెలిగ్రామ్ సర్వే పేరిట తమ గ్రూప్‌లో చేరాలని ఒక మెసేజ్ వచ్చింది.
‘ఎకనామిక్ టాస్క్’ పేరిట దేశంలోని పలు స్టార్ హోటళ్లకు రేటింగ్ ఇవ్వడం ద్వారా ఆదాయం పొందవచ్చని, రూ.2,000 పెట్టుబడి పెడితే రూ.2,800 వస్తాయని నమ్మించారు. ఇంకా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే అధిక లాభం పొందవచ్చని తెలిపారు. క్రెడిట్ స్కోర్ పెంచుకున్నాక డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చని వివరించారు.
దీంతో వారిని నమ్మిన బాధితుడు పలు దఫాలుగా రూ.28.45 లక్షలు పెట్టుబడులుగా పెట్టాడు. అనంతరం డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా ఖాతాలోకి రాలేదు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించి శుక్రవారం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.