calender_icon.png 7 October, 2024 | 5:56 AM

హైడ్రా పేరుతో పేదలను ఇబ్బందులు పెడుతున్నారు

11-09-2024 01:43:35 AM

ఎంఐఎం ఒత్తిడితో హైడ్రా కమిషనర్‌ను మార్చే కుట్ర 

ఎమ్మెల్యే పాయల్ శంకర్

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): రాష్ర్టంలో హైడ్రా పేరుతో హడావుడి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పేదలు, మధ్యతరగతి కుటుంబాలను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. హైడ్రాకు, రాష్ర్ట ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నాలాలు, చెరువులను కబ్జాల చెర నుంచి విడిపించాలని డిమాండ్ చేశారు. కబ్జాలతో చేసిన కట్టడాలను కూల్చితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

2022లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చెరువుల సుందరీకరణ పేరుతో నగరంలోని 25 చెరువులను బడా కంపెనీలకు ధారాదత్తం చేసిందని వాపోయారు. నానక్ రామ్ గూడలో మీనాక్షి ఇన్ ఫ్రా స్ట్రక్చర్ వద్ద చెరువు మధ్యలో నుంచి రోడ్డు నిర్మించి, బహుళ అంతస్థుల కట్టడాలు నిర్మించి వ్యాపారాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. సల్కం చెరువులో  ఎంఐఎం వాళ్లు అక్రమంగా ఫాతిమా కాలేజీని నిర్మిస్తే దాన్ని ఎందుకు కూల్చలేదని ఎంఐఎంకు ఓ న్యాయం..

సామాన్యులకు మరో న్యాయ మా అని మండిపడ్డారు. హైడ్రాపై ఎంఐఎం పార్టీ ఒత్తిడి తీవ్రమైనట్లు అనుమానంగా ఉందని, హైడ్రా కమిషనర్ తో పాటు సంబంధిత అధికారులను కూడా మార్చే ప్రయత్నంలో రాష్ర్ట ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుందన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన చెరువుల ఆక్రమణల వ్యవహారంపై సమీక్ష జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.