ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కూకట్‌పల్లి, ఆగస్టు 30: కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని అల్లాపూర్ డివిజన్‌లో హైడ్రా నోటీసులు ఇచ్చిన కుటుంబా లను శుక్రవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, డివిజన్ కార్పొరేటర్ సబిహాగౌసుద్దీన్ కలిశారు. తాము ఎన్నో దశాబ్దాలుగా నివసిస్తున్న ఇళ్లకు హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్యేకు గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధ వరం కృష్ణారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలోనే రాజీవ్‌గాంధీ నగర్ కాలనీ ఏర్పడిందన్నారు.
అదే సమయంలో సబ్దర్ నగర్, పద్మావతి నగర్ ప్రాంతాల్లో పేదలు ఇళ్లు కట్టుకొని నివాసముంటున్నారని పేర్కొన్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారి ఇళ్లకు నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హైడ్రా పేరుతో పేదల జోలికొస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. కొంతమంది రాజకీయ నాయకులు పార్టీ పెద్దలతో ఫొటోలు దిగి స్థానికంగా బిల్డింగుల వద్ద లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.