బాధితుడి ఖాతా నుంచి రూ.10 లక్షలు స్వాహా
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 21 (విజయక్రాంతి): ఫెడెక్స్ కొరియర్‌లో నిషేధిత వస్తువులు పంపిస్తున్నారంటూ ఓ వ్యక్తిని భయబ్రాంతులకు గురిచేసిన సైబర్ నేరగాళ్లు అతడి ఖాతాలో ఉన్న రూ. 10 లక్షలను కాజేశారు. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన ఓ వ్యాపారి(44)కి ఫెడెక్స్ కొరియర్ ప్రతినిధులమంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు.
మీ సంబంధిత వివరాలపై ముంబై నుంచి సింగపూర్ పంపిస్తున్న పార్సిల్‌లో 2 కిలోల వస్త్రాలతో పాటు 150 ఎల్‌ఎస్‌డీ(మాదకద్రవ్యాలు) బాల్స్ ఉన్నట్లు గుర్తించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పార్శిల్‌ను స్వాధీ నం చేసుకున్నారని చెప్పారు. దీంతో బాధితుడిపై కేసు నమోదైందని, విచారణ నిమిత్తం సైబర్ క్రైమ్ అధికారులతో మాట్లాడాలని సూచించారు.
అనంతరం పోలీసు వేషధారణలో స్కైప్ వీడియో కాల్‌లోకి వచ్చిన స్కామర్ బాధితుడిని పలు రకాల ప్రశ్నలతో ఇబ్బందులకు గురిచేసి, తన ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను పొందాడు. ఈ కేసుతో సంబంధం లేకుంటే ఆర్బీఐ నిబంధనల మేరకు బాధితుడి ఖాతా లో ఉన్న మొత్తాన్ని తాము సూచించిన ఖాతాకు బదిలీ చేయాలని, విచారణ ముగిసిన తర్వాత తిరిగి పంపిస్తామని చెప్పారు.
నిజమని నమ్మిన బాధితుడు పలు దఫాలుగా వారు చెప్పిన అకౌంట్‌కు రూ.10 లక్షలు బదిలీ చేశాడు. ఆ తర్వాత అవతలి వారి నుంచి స్పం దన లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి గురువారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.