2.92 లక్షలు లూటీ చేసిన సైబర్ నేరగాడు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 29 (విజయక్రాంతి): కేబుల్ టీవీ రిఛార్జ్ పేరుతో రూ. 2.92 లక్షలు కాజేశాడు సైబర్ నేరగాడు. వివరాలిలా ఉన్నాయి.. నగరంలోని ఓ వ్యాపారికి చెందిన కేబుల్ టీవీ రిఛార్జ్ గడువు ముగియడంతో కస్టమర్ సర్వీస్ నంబర్ కోసం ఆన్‌లైన్‌లో వెతికాడు. ఈ క్రమంలో 1800 102 9936 నంబర్ కనిపించగా ఫోన్ చేసి మాట్లాడాడు.
ఫోన్ కాల్‌లోకి వచ్చిన సైబర్ నేరగాడు మరింత సమాచారం కోసం సంప్రదించాలని తన వ్యక్తిగత నంబర్ అందించాడు. ధ్రువీకరణ కోసం బాధితుడిని రూ.10 చెల్లించమని అడిగాడు. బాధితుడు చెల్లింపు చేయడానికి ప్రయత్నించగా అది విఫలమైంది. దీంతో కస్టమర్ సపోర్ట్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని ఓ లింక్ పంపాడు.
యాప్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత బ్యాంక్ వివరాలను అందించాలని కోరాడు. బ్యాంక్ వివరాలు అందించిన అనంతరం బాధితుడి ఫోన్ హ్యాక్ చేసి కాసేపటి తర్వాత తిరిగి పునరుద్ధరించాడు. కానీ, కొద్ది నిమిషాల్లోనే బాధితుడి ఖాతాలోని రూ. 2.92 లక్షలు ఆయన ప్రమేయం లేకుండానే డెబిట్ చేయబడ్డాయి. దీంతో మోసపోయానని గుర్తించి మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.