calender_icon.png 19 April, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యల చెంత.. రోడ్డుపైనే ’సంత’..

05-04-2025 12:00:00 AM

  1. వేములవాడ ప్రధాన రహదారిపై వారసంత 
  2. వాహనదారులకు తప్పని  ఇబ్బందులు
  3. మార్కెటుకు వచ్చే మహిళలకు తిప్పలు 

జగిత్యాల, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గ కేంద్రం పేరుకే పెద్ద పట్టణం. ప్రభుత్వ గణాంకాల ప్రకారం వసతులు, వనరుల విషయంలో ద్వితీయ శ్రేణి మునిసిపాలిటీగా గుర్తింపు పొందింది. ఇంతవరకు బాగానే ఉండగా, పట్టణ ప్రజల నుండి పలు రకాల పన్నులు వసూలు చేసే విషయంలో కనిపించిన అభివృద్ధి, మార్కెట్ విషయంలో మాత్రం శూన్య మైంది.

కొన్ని దశాబ్దాల కాలంగా కోరుట్ల పట్టణంలో రోడ్డుపైనే వారసంత (అంగడి) నిర్వహిస్తుండడం విడ్డూరం. నిజామాబాద్ జిల్లా పెర్కిట్ నుండి జగిత్యాల, మంచిర్యాల జిల్లాల మీదుగా మధ్యప్రదేశ్ జగ్దల్పూర్ వెళ్లే జాతీయ రహదారిని ఆనుకొని, కోరుట్ల నుండి వేములవాడకు వెళ్లే ప్రధాన రహదారి ఉంది. ప్రతిరోజు కోరుట్ల పట్టణ పరిధిలోని ఈ రాష్ట్రీయ రహదారిపై వేలాది వాహనాలు వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట మీదుగా రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు వెళుతుంటాయి.

నిత్యం పలురకాల చిన్న తరహా, భారీ వాహనాలు తిరిగే ఈ వేములవాడ ప్రధాన రహదారిపైనే ప్రతి బుధవారం కోరుట్లలో వారసంత (అంగడి) జరుగుతున్నది. ఈ ప్రధాన రహదారిపైనే రోడ్డుకు ఇరువైపులా కూర్చుని పలు రకాల చిరు వ్యాపారులు, కూరగాయలమ్మే రైతు లు, పండ్ల వ్యాపారులు, తోపుడు బండ్ల వారు తమ వ్యాపారాలు నిర్వహిస్తుంటారు.

అంతేకాక రోజుకు ఒక ఊరు తిరిగి బట్టలు, బుట్టలు, చిన్నాచితక గృహోపకరణాలు అమ్ముకునే వ్యాపారులు కూడా ఈ వారసంతకు వస్తుంటారు. వేములవాడ ప్రధాన రహదారిపై జరిగే ఈ సంతకు కోరుట్ల పట్టణంతో పాటూ పరిసర గ్రామాల నుండి కూడా చిరు వ్యాపారులు, తమకు అవసరమయ్యే నిత్యవసర సరుకులు కొనుగోలు చేసే జనాలు పెద్ద సంఖ్యలోనే వస్తారు.

దీంతో ఇటు వ్యాపారులతో, అటు కొనుగోలు చేసేందుకు వచ్చే జనాలతో ఈ వార సంత ఎప్పుడూ బిజీగా కిటకిటలాడుతోంది. వాస్తవానికది వేములవాడ వెళ్లే ప్రధాన రహదారి కాబట్టి అనునిత్యం ఆ రోడ్డుపై తిరిగే వాహనాల రాకపోకలకు ఈ వారసంత నిర్వహణ పెద్ద అడ్డంకిగా  మారింది. పైపెచ్చు వారసంతలో అటూ ఇటు తిరిగే జనాలకు రోడ్డుపై వచ్చే వాహనాలతో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

పలుసార్లు బుధవారం అంగడి జరుగుతున్న సమయంలో ఈ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు కోకోల్లోలు. ఇదిలా ఉండగా వారం పాటూ తమ వంటింట్లోకి అవసరమయ్యే కూరగాయలు, దినుసులు కొనుక్కో వడానికి పెద్ద సంఖ్యలో మహిళలు కూడా ఈ సంతకు వస్తుంటారు. ఇదే అదునుగా కొందరు పోకిరీలు వారసంత జరిగే ఈ రోడ్డు మీదుగా అవసరం లేకున్నా ద్విచక్ర వాహనాలతో అటు ఇటు తిరుగుతూ మహిళలను ఇబ్బంది పెట్టడం తరచూ జరుగుతూ నే ఉంది.

అయితే జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఈ వేములవాడ రహదారి కూడలిలో పురాతన జిటిఎఫ్ గోదాం స్థలం ఉంది. ఒకప్పుడు ఆ జిటిఎఫ్ గోదాం బాపతు ఖాళీ స్థలంలోనే వారసంత జరిగేది. సదరు గోదాం స్థలాన్ని అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అప్పటి ప్రభుత్వం ఇరువైపులా రోడ్డును ఆనుకొని ఉన్న షాపింగ్ స్థలాలను వేలంవేసి విక్రయించింది.

లోపలి ఖాళీ స్థలంలో కనీస వస తులు లేని ఓ మార్కెట్ నిర్మించి చేతులు దులుపుకున్నారు. దాంతో లోపలి మార్కెట్లో ఉంటే తమ వ్యాపారాలు జరగడంలేదని, సదరు చిరు వ్యాపారులందరూ మళ్లీ రోడ్డుపైనే తమ అంగళ్లు నిర్వహించడం ప్రారం భించారు. ప్రస్తుతం సదరు జిటిఎఫ్ గోదాం వెనుక వైపు నిర్మించిన మార్కెట్ షెడ్లను కూల్చివేసి, సుమారు రూ. 100 కోట్ల నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు.

అయినప్పటికీ ఈ వారసంత సమస్య మాత్రం దశాబ్దాల కాలంగా అపరిష్కృతంగా ఉండిపోయింది. రోడ్డుపై వచ్చే వాహనదారులకు, వారసంతకు వచ్చే జనాలకు తిప్పలు తప్పడం లేదు. సంబంధిత మునిసిపల్ అధికారులు ప్రజా ప్రతినిధులు కోరుట్లలో రోడ్డుపైనే జరుగుతున్న సంతకు శాశ్వత పరిష్కారం చూపిస్తే బాగుంటుంది.