calender_icon.png 28 December, 2024 | 12:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలువల విద్య ఎక్కడ?

19-09-2024 12:00:00 AM

ఆధునిక శాస్త్రీయ సాంకేతిక మాయలో, కాల ఇంద్రజాలంలో గ్లోబలైజేషన్ రాకతో నేటి ఆధునిక విద్య ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌తో చాలా వేగంగా అడుగులు వేస్తున్నది. ఈ నాగరిక సమాజంలో కూడా ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు, మానవ సంబంధాలపై జరుగుతున్న ఆయుధ దాడుల వంటి అమానవీయ సంఘటనలతోపాటు మానవతను మరిచి స్వార్థంతో పరుగులెడుతున్న నేటి నవతరంలో శాస్త్రీయత, ఆధ్యాత్మిక, పర్యావరణ, నైతిక విలువలతో కూడిన ప్రాథమిక విద్య చాలా అవసరం. పేద, ధనిక తేడా లేకుండా కేవలం అందరికీ సమాన విద్యావకాశాలు గల అంతర్జాతీయ స్థాయి విద్య ద్వారానే నేటి ఆధునిక సవాళ్ళను, సమస్యలను మనం ఎదుర్కోగలం.

అది అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయుల ద్వారానే సాధ్యమవుతుంది. నేటి నవీన డిజిటల్ ఎడ్యుకేషన్‌లో సరైన సదుపాయాలు లేక పాత బోధన పద్ధతులు, ఉపాధ్యాయుల ఖాళీలు వంటి పలు సమస్యలతో ప్రభుత్వ విద్యాసంస్థలు సతమతమవుతున్నాయి. ఇక కొన్ని ప్రైవేట్ కార్పొ రేట్ విద్యాసంస్థలు విద్యను పూర్తి వ్యాపారంగా మార్చాయి. ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న బోధ న, బోధనేతర సిబ్బంది చాలీచాలని జీతాలతో సరిపెట్టుకుంటు న్నారు. విద్యార్థులు ర్యాంకులు, మార్కుల పేరిట వెట్టిచాకిరి చేస్తూ శారీరకంగా మానసికంగా కుంగిపోతున్నారు. సమాజంలో కూడా నేడు ఉపాధ్యాయ, అధ్యాపకుల గౌరవ స్థాయి అనేది ప్రతిభ, నైపుణ్యం, సేవా పరంగా కాకుండా కేవలం సంపాదనే కొలమానం అయింది.

దీనిని తీవ్ర సమస్యగా పరిగణించవలసి ఉంది. ప్రైవేట్ రంగంలో విద్యాబోధన చేయడానికి నేటి యువతరంలో అర్హులైన ఉన్నత విద్యావంతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీనికి కారణాలు అనేకం. భవిష్యత్తు విద్యారంగానికి ప్రమాదమైన హెచ్చరికగా దీనిని గుర్తించాలి. చదువు చెప్పడాన్ని చాలా గొప్పగా భావిస్తూ, తమ సంపాదనకంటే విద్యార్థుల ఎదుగుదలే ముఖ్యం అనుకునే ఉపాధ్యాయ, అధ్యాప కులు నేటి సమాజానికి అవసరం. అలాంటివారు కొందరు లేకపోలేదు. వారిని కాపాడుకోవడం, గౌరవించడం మన బాధ్యత.

2047 కల్లా అభివృద్ధి భారత నిర్మాణమే మన లక్ష్యం అంటున్న ప్రధానమంత్రి మాటలు నిజం కావాలంటే సరైన విద్యా ప్రణాళిక కావాలి. నేటితరంలోని ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకు లుగా, స్ఫూర్తి ప్రదాతలుగా వుంటూనే మంచి స్నేహితులుగా వాళ్ళమధ్య చిరునవ్వుల వెన్నెలను కురిపించాలి. నూతన సాంకేతికత పోకడలతో వాళ్ళకు జీవితపాఠాలను బోధించాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాలను విద్యార్థులు సాధించగలుగుతారు.

ఫిజిక్స్ అరుణ్ కుమార్