calender_icon.png 23 October, 2024 | 5:06 AM

ఉద్యమ అడుగు జాడల్లో!

23-10-2024 12:00:00 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి) : తెలంగాణ ఉద్యమం ఎంతోమంది యువకులను ఆకర్షించింది. ఉద్య మ బాట పట్టేలా చేసింది. పరోక్షంగానో.. ప్రత్యక్షంగానో ఎంతోమంది చురుకైన పాత్ర పోషించారు. అలా ఉద్యమానికి ఆకర్షితులైనవారిలో జాడి అశోక్ ఒకరు. 2009లో ప్రారంభమైన మలిదశ ఉద్యమంలో రిలే నిరాహార దీక్షల్లో పాల్గొని తనవంతుగా పోరాటాలు చేశాడు. అంతేకాదు.. ఏక్కడైనా దీక్షలు జరిగితే.. సభలు, సమావేశాల కోసం టెంట్, స్టేజీ, కుర్చీలు సమకూర్చి ఆర్థికంగా చేయూతనిచ్చేవాడు.

అలా ఉద్యమం పేరు తో రెండు లక్షల వరకు ఖర్చుపెట్టాడు. స్నేహితులు, కుటుంబ సభ్యులు వద్దని వారించినా ఉద్యమాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. అలాగే విద్యుత్ సమస్యలపై పోరాటంలో భాగంగా పలు సబ్ స్టేషన్ ముట్టడిలో ధిక్కార స్వరం వినిపించాడు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమకారులు బయటకు వస్తే అరెస్టులు చేసే పరిస్థితులున్నా..

వాటిని లెక్కచేయకుండా ఆందోళనలు, ధర్నా కార్యక్రమాలు చేసి ఉద్యమానికి ఊతమయ్యాడు. అయితే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత నకిలీ ఉద్యమకారులు రాజ్యమేలితే.. అశోక్ లాంటివాళ్లు ఆర్థికంగా నష్టపోయి జాడ లేకుండాపోయారు. ఇప్పటికైనా అశోక్ లాంటివాళ్లను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు తెలంగాణ మేధావులు.

ఉద్యమకారులకు గుర్తింపేది?

రాష్ట్రం సిద్ధించి ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఉద్యమకారులకు ఎలాంటి లాభం చేకూరలేదు. ఉద్యమంలో నిస్వార్థంగా పాల్గొన్నవారిని ప్రభుత్వం ఆదుకోవాలి. రాష్ట్రం కోసం పోరాటం చేసినవారికే గుర్తింపు లేకపోతే భావితరాల పౌరులకు ప్రభుత్వాలపై నమ్మకం ఉండదు. ఉద్యమకారుల పోరాటాలతో గద్దెనెక్కిన గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రస్తుత ప్రభుత్వం అమరుల త్యాగాలు, ఉద్యమకారులను గుర్తించాలి.  

 జాడి ఆశోక్, ఉద్యమకారుడు