calender_icon.png 20 September, 2024 | 6:07 PM

గోమాత అడుగుల్లో..

19-09-2024 03:08:38 AM

రాబోయే రోజుల్లో గో రక్షా ఉద్యమం ప్రధాన జాతీయ పార్టీల ఎన్నికల ప్రధాన అజెండాగా మారడం ఖాయమనిపిస్తోంది.  మరో మూడు రోజుల్లో  అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామీజీ చేపట్టబోయే యాత్ర  దేశ రాజకీయాలనే ఓ మలుపు తిప్పడం ఖాయంగా కనిపిస్తోంది. ౨౦౨౯ ఎన్నికల్లో గో రక్షణ ఒక అంశంగా ముందుకురావడంగాని లేదా అంతకన్నా ముందే గోవును రాష్ట్ర మాతగా ప్రకటించవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు.

న్యూఢిల్లీ:  రాబోయే ఎన్నికల నాటికి గో రక్షా ఉద్యమం జాతీయ ఎన్నికల నినాదంగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. గో ప్రతిష్ఠ ఆందోళన్‌లో భాగంగా జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి  ఈనెల 22నుంచి దేశవ్యాప్తంగా గో ధ్వజ స్థాపన యాత్రను నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన జాతీయ పార్టీలయిన బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా అదే బాటలో పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇందుకు సంకేతం ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో కొత్తగా అడుగుపెట్టిన లేగదూడతో దిగిన ఫొటోలే. ప్రధాని తన సోషల్ మీడియా ఖాతాలో ఉంచిన ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం తాము మొదటినుంచి గోమాతకు విశేష ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇందిరాగాంధీ హయాంలో తమ పార్టీ గుర్తు ‘ఆవు దూడ’ అన్న విషయాన్ని గుర్తుచేస్తోంది.  

ఊపందుకుంటున్న గోరక్షా ఉద్యమం

 ఇటీవలి కాలంలో రాజకీయాలతో సంబంధం లేకుండా చేపట్టిన గోరక్షా ఉద్యమం దేశవ్యాప్త ఉద్యమంగా ఊపందుకుంటోంది. నిజానికి పార్టీలతో సంబంధం లేకుండా అనేకమంది గో రక్షకు నడుం కట్టి గోశాలలను నిర్వహి స్తున్న విషయం తెలిసిందే. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గోమాతను రాష్ట్ర జాబితానుంచి తొలగించి కేంద్ర జాబితాలో చేర్చి ‘రాష్ట్ర మాత’గా పరిగణిం చాలనే డిమాండ్ చాలా కాలంగా ఉన్నదే. వేదాలు, పురాణాలనే కాదు భారత రాజ్యాంగంలో కూడా గోవుకు ఉన్నత స్థానం కల్పించింది.

హిందువులు పవిత్రంగా చూసే గోవు ౩౩ వేల మంది దేవుళ్లకు సమానమని భావిస్తుంటారు. గోవును చంపడం మహాపాతకమని భావిస్తుంటారు. ఆవు పాలు ఆరోగ్యానికి మంచిదని, రోగాలను దూరం చేస్తాయని చెప్పేందుకు శాస్త్రీయ మైన ఆధారాలు ఉన్నాయి. ఆవు పేడ, గో మూత్రం  పంట భూములకు మంచివని తద్వారా రసాయన ఎరువులను దూరం చేసుకొని సహజంగా పంటలు పండించు కోవడం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించు కోవచ్చు.  రాజ్యాంగం, చట్టాల్లో గోమాతకు ప్రాధాన్యం కల్పించి దేశమంతా గోమాతకు సంపూర్ణ గౌరవం లభించేలా చూడాలన్న బృహత్ సంకల్పంతో జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి గోప్రతిష్ఠ ఆందోళనలో భాగంగా దేశవ్యాప్తంగా గోధ్వజస్థాపన యాత్రను చేపట్టాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఈ నెల 22న అయోధ్యలో ప్రారంభమయ్యే ఈ యాత్ర 33 రోజుల పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల గుండా సాగి అక్టోబర్ 26న న్యూఢిల్లీలో ముగుస్తుంది. శంకరాచార్య చేపట్టనున్న ఈ యాత్రకు ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని వర్గాలనుంచి విశేష స్పందన లభిస్తోంది. 

పార్టీలకు అజెండాగా..

ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలయిన బీజేపీ, కాంగ్రెస్‌లు సైతం గోమాత రక్షణను తమ అజెండాగా చేసుకోవచ్చన్న సంకేతాలు అప్పుడే కనిపిస్తు న్నాయి.  భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంనుంచి కూడా హిందుత్వకు సంబం ధించిన ఏదో ఒక అంశాన్ని ఎన్నికల అజెండాగా చేసుకుని  ఎన్నికల బరిలోకి దిగుతూ ఉన్న విషయం తెలిసిందే. ఎల్ కే అద్వానీ చేపట్టిన రథయాత్ర మొదలుకొని మొన్నటి అయోధ్య రామమందిర ప్రతిష్ఠ వరకు ఇలాంటి అంశాలే ఆ పార్టీకి ఎన్నికల అజెండాగా కొనసాగుతూ వస్తున్నాయి. కానీ అయోధ్య అంశం ఇటీలి లోక్‌సభ ఎన్నికల్లో పెద్దగా హిందుత్వ ఓటర్లను ఆకర్షించలేకపోయిందనే విషయం ఫలితాలను విశ్లేషించిన ఎవరికైనా అర్థమవుతుంది.

అయినప్పటికీ రాబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ ఇప్పటికే వారణాసి, మథుర ఆలయాలను జాతీయ సమస్యగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. వారణాసి కాశీ విశ్వేశ్వరుని ఆలయం సమీపంలోని జ్ఞానవాపి మసీదు ఒకప్పుడు హిందువుల ఆలయమేనంటూ బీజేపీ నేతలు వాదిస్తున్నారు. న్యాయపరంగా ఈ విషయాన్ని నిరూపించడానికి యత్నిస్తూ ఉంది. మరో వైపు అయోధ్య తర్వాత తమ అజెండా మథురేనని ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు కూడా.

నిజానికి భారతీయ జనతా పార్టీకి మాతృసంస్థ అయిన ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్’  ప్రధాన అజెండా హిందుత్వ నినాదమే. ఒక రాజకీయ పార్టీగా బీజేపీ తన మాతృసంస్థ అజెండాను పూర్తిగా తలకెత్తుకోకపోయినా లోలోపల అదే అజెండాతో పనిచేస్తూ ఉంది. దేశంలో ముస్లింల ప్రాబల్యాన్ని ఓ పద్ధతి ప్రకారం దెబ్బ తీస్తూ, తన అజెండాను అమలు చేసుకుంటూ వస్తున్నది. దీని ద్వారా ‘ఒక దెబ్బకు రెండు పిట్టలు’ అన్న తరహాలో అటు ముస్లిం ఓటు బ్యాంకును బలహీన పరచడంతో పాటుగా ఇటు హిందుత్వ ఓటు బ్యాంకును పటిష్టం చేసుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో మందిర నినాదాలు పెద్దగా ఓట్లు రాల్చే పరిస్థితి లేదని గ్రహించిన కమలనాథులు ఇప్పుడు గోరక్షా ఉద్యమాన్ని అందిపుచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. 

కాంగ్రెస్‌కూ అవసరమే..

మరో వైపు వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే బాటలో నడవక తప్పని స్థితి. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి రాజకీయంగా వరస ఎదురుదెబ్బలు తిన్న ఆ పార్టీ ఇప్పుడిప్పుడే తిరిగి బలపడే ప్రయత్నాలు చేస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నిటినీ ఒక తాటిపైకి తెచ్చి బీజేపీపై కలిసికట్టుగా పోరాటం సాగించడం ద్వారా ఆ పార్టీ మోదీ ప్రాబల్యాన్ని కొంతమేరకు దెబ్బతీయగలిగింది. ఈ ఏడాదిలో వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే వ్యూహంతో మెరుగైన ఫలితాలు సాధించాలనుకుంటోంది.

అదే సమయంలో రాబోయే లోక్‌సభ ఎన్నికల నాటికి ఓ బలమైన వ్యూహాన్ని సిద్ధం చేసుకునేందుకు కూడా ఆ పార్టీ ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ తరుణంలో  దేశవ్యాప్తంగా  ఊపందుకుంటున్న గోరక్షా ఉద్యమానికి మద్దతు ఇవ్వడం ఆ పార్టీకి ఎంతయినా అవసరం. గోరక్షా ఉద్యమానికి తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని, నిజానికి ఇందిరాగాంధీ నేతృత్వంలో ‘కొత్త కాంగ్రెస్’ ఎన్నికల గుర్తే ‘ఆవు, దూడ’ అన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అందివచ్చిన సదవకాశాన్ని అది తప్పకుండా ఉపయోగించుకుంటుంది అనడంలో సందేహం లేదు.  రెండు ప్రధాన జాతీయ పార్టీలు గో రక్షా ఉద్యమాన్ని తమ అజెండాగా చేసుకున్న తర్వాత మిగతా ప్రాంతీయ పార్టీలు సైతం ఓట్ల కోసమైనా అదే బాటలో నడవని పరిస్థితి.