calender_icon.png 16 January, 2025 | 11:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చివర్లో పిటిషన్ దాఖలు బ్లాక్‌మెయిలే

03-09-2024 12:50:49 AM

పీవోపీ విగ్రహాల నిమజ్జనం పిటిషన్‌పై హైకోర్టు వ్యాఖ్య

హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): వినాయక చవితికి వారం రోజుల ముందు మధ్యంతర పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. చివరి సమయంలో హడావుడిగా పిటిషన్ వేయడమంటే కోర్టును బ్లాక్మెయిల్ చేయడమే అవుతుందని మండిపడింది. తాజాగా దాఖలైన మధ్యంతర పిటిషన్లో ఉత్తర్వుల జారీకి నిరాకరించింది. విచారణను వినాయక చవితి తర్వాత చేపడతామని ప్రకటిం చింది. ఈలోగా రాష్ట్రంలోని చెరువులు, కుంటల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) విగ్రహాల నిమజ్జనంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ నెల 9 వరకు సమయం ఇస్తున్నామని, ఆలోగా కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. ఇదే హైకోర్టు, 2021లో వినాయక నిమజ్జనాలపై కీలక ఆదేశాలు జారీ చేసిందని, వాటిని పరిశీలన చేస్తే తదుపరి ఉత్తర్వులు ఉంటాయని వెల్లడించింది. హుస్సేన్ సాగర్‌తోపాటు చెరువుల్లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయటానికి వీళ్లేదని, పీవోపీ విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి కుంటల్లో మాత్రమే నిమజ్జనం చేయాలని గతంలో ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది.

హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని, ఈ ఏడాది కూడా హుస్సేన్ సాగర్లో పీవోపీతో చేసిన గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, డీజీపీ, పోలీస్ కమిషనర్లు, రెవెన్యూ, ఎంఏయూడీ అధికారులకు మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ఆదేశించారంటూ వ్యక్తిగత హోదాలో న్యాయవాది మామిడి వేణుగోపాల్ మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. పీవోపీతో తయారు చేసిన గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి కూడా సాగర్ చుట్టూ 33 క్రేన్లను ఏర్పాటు చేయాలని, గత ఏడాది 17 క్రేన్లను వాడారని పిటిషన్లో పేర్కొన్నారు.

దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాస్‌రావు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ స్పందన తెలియ జేసేందుకు వారం సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. ప్రతిసారి ప్రభుత్వం సమయం కోరుతూ కాలయాపన చేస్తోందని పిటిషనర్ లాయర్ అభ్యంతరం చప్పారు. కాగా, వినాయక చవితి వారంలో ప్రారంభమవుతుందనగా మధ్యంతర పిటిషన్ దాఖలు చేయడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. ఇది కోర్టును బ్లాక్మెయిల్ చేయడమేనని పిటిషన్ప ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 9కి వాయిదా వేసింది.