calender_icon.png 26 December, 2024 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూతురి హత్య కేసులో

19-10-2024 12:53:08 AM

తల్లి, ఆమె ప్రియుడికి జీవిత ఖైదు 

సంగారెడ్డి, అక్టోబర్ 18 (విజయక్రాంతి): కూతురిని హత్య చేసిన తల్లికి, ఆమె ప్రియుడికి జీవిత ఖైదు విధిస్తూ జిల్లా జడ్జి జీ భవానీచంద్ర శుక్రవారం తీర్పు వెల్లడించారని సంగారెడ్డి ఎస్పీ రూపేష్ తెలిపారు. ఈ మేరకు తన కార్యాలయంలో కోర్టు తీర్పు వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన కల్పన రెండో కాన్పు కోసం పుట్టినిల్లు అయిన షాబాద్ మండలంలోని బోడపహాడ్ గ్రామానికి వచ్చింది. అయితే, కల్పన వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలంలోని కేసారం గ్రామానికి చెందిన ఆలంపల్లి రాజు అనే ట్రాక్టర్ డ్రైవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకొని సదాశివపేటలో నివాసం ఉన్నది. 2019 ఫిబ్రవరి 26న తన పెద్ద కూతురు చనిపోయిందని బంధువులకు సమాచారం ఇచ్చింది. మృతురాలి ఒంటిపై కమిలిన గాయాలు ఉండడం తో అనుమానం వచ్చిన కల్పన భర్త వీరేశ్ సదాశివపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు.. రాజు అనే వ్యక్తితో కల్పన వివాహేతర సంబంధం పెట్టుకొని తన ఇద్దరు పిల్లలైన భవ్య (3), 9 నెలల భావనతో కలిసి సదాశివపేటలో నివాసం ఉంటోందని గుర్తించారు. ఈ క్రమంలోనే రాజును భవ్య నాన్న అని పిలవకపో వడంతో తలను గోడకు కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం దవాఖానకు తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయింది. అప్పుటి సదాశివపేట సీఐ శ్రీధర్‌రెడ్డి విచారణ చేపట్టి రాజు, కల్పనపై కేసు నమోదు చేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన జిల్లా జడ్జి జీ భవానీచంద్ర నిందితులకు జీవిత ఖైదుతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని ఎస్పీ తెలిపారు.