calender_icon.png 19 November, 2024 | 8:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదేండ్లలోనే.. వందేండ్ల దోపిడీ

19-11-2024 02:20:03 AM

  1. ప్రాజెక్టుల పేరిట ప్రజాధనం లూటీచేసిన బీఆర్‌ఎస్
  2. మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ కుట్ర 
  3. బీఆర్‌ఎస్ పార్టీలో మిగిలేది కేసీఆర్, కేటీఆర్, కవితే 
  4. 11 నెలల పాలనలో 54 వేల ఉద్యోగాలు భర్తీ చేసినం 
  5. కాంగ్రెస్ చేసిన అభివృద్ధిపై చర్చకు హరీశ్ సిద్ధమా? 
  6. రాహుల్‌గాంధీని ప్రధాని చేసేందుకు కార్యకర్తలు కష్టపడాలి
  7. అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు సమగ్ర సర్వే 
  8.  పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ 

సంగారెడ్డి, నవంబర్ 18 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో వంద సంవత్సరాల దోపిడీ చేసిందని, పాజెక్టుల పేరుతో ప్రజాధనం దోచుకుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. సోమవారం సంగారెడ్డిలో కాంగ్రెస్ జిల్లా నాయకులు, కార్యకర్తల సమావేశానికి హజరై, మాట్లాడారు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టగానే ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్‌ఎస్, బీజేపీలు కుట్రలు చేశాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. కుట్ర చేసిన బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పారు. బీఆర్‌ఎస్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు సైతం ఉండరని, ఆ పార్టీలో మిగిలేది కేసీఆర్, కేటీఆర్, కవిత మాత్రమేనని ఎద్దేవా చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల వరకు బీఆర్‌ఎస్ పార్టీ ఖాళీ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజల కష్టాలను చూసి సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని.. ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిందని విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 8.5 లక్షల కోట్లు అప్పులు చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పగించిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెలా అప్పులకు వడ్డీలు చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం 11 నెలల్లో ఎంత అభివృద్ధి చేసిందో చూపిస్తామని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఏం చేసిందో చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావుకు సవాల్ విసిరారు. ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.18 వేల కోట్లతో రైతుల రుణాలు మాఫి చేసిందని స్పష్టంచేశారు. మరో 10 వేల కోట్లతో మిగిలిపోయిన రుణాలు మాఫీ చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.

విద్యా, వైద్యంకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. రాష్ట్రంలో కొత్తగా రూ.128 కోట్లతో 28 పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 11 నెలల్లో రాష్ట్రంలో 54 వేల ఉద్యోగలు భర్తీ చేసిందని స్పష్టంచేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో 50 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. కాళేశ్వరం పేరుతో ప్రజాధనాన్ని దోపిడీ చేశారని మండిపడ్డారు.

బీఆర్‌ఎస్ కట్టిన కాళేశ్వరం పదేళ్లు ఉండలేదని, కాంగ్రెస్ కట్టించిన నిజాంసాగర్, పోచంపాడు ప్రాజెక్టులు 70 ఏండ్లయినా మరమ్మతులకు కూడా రాలేదని పేర్కొన్నారు. దేశంలోనే మొదటిసారి తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి సమగ్ర కులగణన సర్వేను చేపట్టారని స్పష్టంచేశారు.

మాజీ సీఎం కేసీఆర్ ఎప్పుడైన మంత్రులను, ఎమ్మెల్యేలను, కార్యకర్తలను కలిశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తుందని.. మరో ఐదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండాలని ఆకాంక్షించారు. కేంద్రంలో రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.  

స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలవాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో గెలుపొందడం కోసం కార్యకర్తలు కష్టపడి పని చేయాలని మహేశ్‌కుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 40 కార్పొరేషన్ పోస్టులను జనవరిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అప్పుడు నాయకులకు, కార్యకర్తలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే 37 కార్పొరేషన్ పదవులు భర్తీ చేసిందన్నారు. మంత్రి మండలి విస్తరణకు పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. కార్యకర్తలు కష్టపడి పని చేసి కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావాలని కోరారు. పార్టీలో విభేదాలు ఉన్నా.. ఎన్నికల్లో కలసి పని చేసేందుకు కృషి చేయాలన్నారు. 

ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్‌ఎస్ దోపిడీ 

నిరంకుశ, కుటుంబ పాలనను వ్యతిరేకించి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో బీఆర్‌ఎస్ నేతలు దొపిడీ చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమ లు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు. రైతు భరోసా డబ్బులు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సర్పంచ్, ఎంపీటిసి, జడ్పీటీసీ, మున్సిపల్  ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు.

సమావేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, సెట్విన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, జిల్లా గ్రం థాలయ చైర్మన్ జీ అంజయ్య, నాయకులు నీలం మధు, ఉజ్వల్‌రెడ్డి, గాలి అనిల్‌కుమార్, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.