calender_icon.png 10 January, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివుని సిగలో.. గంగమ్మ!

10-10-2024 12:00:00 AM

రేలారె రేలా గంగా.. పాట పాడితే చాలు ఊరు ఊరంతా పండుగ వాతావరణం అలుముకుంటుంది. ప్రతి పాటలో పల్లె వాతావరణం కనిపిస్తుంది. ‘పండుగ పూట తోటి యరళ్లు, వదినే.. మరదళ్లు.. పట్టు చీరలు.. పాపేట బిల్లెలు.. కాళ్లకు పారాణి రాసుకొని.. బతుకమ్మలు నెత్తినెత్తుకొని బైలెల్లీతే పుడమి మురిసిపోతుంది.’ అంటున్నారు రేలారె రేలా గంగా.

ఊహ తెలిసినప్పటి నుంచి పాటలు వింటూ పెరగడంతో.. పాటకు ప్రాణం పోసి పాడుతున్నది ఫోక్ సింగర్ గంగా. ‘రేలారె రేలా గంగా’ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రతినెల కొత్త పాటలను పరిచయం చేస్తున్నది. సద్దుల బతుకమ్మ సందర్భంగా విజయక్రాంతితో ముచ్చటించారామె!    

మన తెలంగాణలో పువ్వులను పూజిం చే అతి పెద్ద పండుగ బతుకమ్మ. ఆడబిడ్డలైతే ముఖ్యంగా గౌరమ్మ తల్లిని ఘనంగా కొలుస్తారు. ముత్తుదులు పసుపు, బొట్టు పెట్టించుకుంటారు. ఒక విధంగా మన సంస్కృతిని ప్రతిబింబించే పండుగ ఇది. నాకు ముఖ్యంగా రెండే రెండు పండుగలు ఇష్టం. వాటిలో ఒకటి బతుకమ్మ.. రెండోది వినాయక చవితి. 

నా చిన్నతనంలో..

ప్రత్యేకంగా కొందరు బతుకమ్మ సందర్భంగా తీసుకొస్తున్న పాటలు వింటే ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఎందుకంటే.. స్వచ్ఛమైన మన సంస్కృతి కనుమరుగు అవుతుందేమో.. రాబోయే తరాలకు ఒకప్పుడు బతుకమ్మ ఎలా ఉండేదో వివరించాల్సిన పరిస్థితి వచ్చింది. పాటలు కూడా ట్రెడిషనల్‌ను చూపించే విధంగా వస్తే బాగుంటుంది.

మన పిల్లలకు మన పాటల ద్వారా.. పండుగల ద్వారా సంస్కృతి, సంప్రదాయాలను అర్థమయ్యే విధంగా పాటలు వస్తే బాగుంటుంది. మా చిన్నప్పుడు అమ్మమ్మ.. అమ్మ వాళ్లు పట్టు చీరలు కట్టుకొని, చేతినిండా గాజులు వేసుకొని బతుకమ్మ ఆడేవాళ్లు. అది కూడా భయపడుకుంటూ.. సిగ్గుపడుకుంటూ బతుకమ్మ ఆడేది. ఇప్పుడలా లేదు పరిస్థితి. 

అర్థవంతమైన పాటలే పాడుతా!

రేలారె రేలా గంగా అని యూట్యూబ్ ఛానెల్ ఉంది.. దాంట్లో నెలకు ఒక పాటను రిలీజ్ చేస్తున్నా.. నేను పాడుతుంట.. లేదంటే కొత్త పిల్లల గొంతు బాగుంటే.. వాళ్లను ఎంకరెజ్ చేసి వారి ద్వారా పాడిస్తుంటా. వ్యంగ్యంగా ఉండే పాటలను నేను అసలు పాడను. వాటిని పాడటానికి కూడా ఒప్పుకొను.. వాళ్లకు డైరెక్టుగా చెప్పేస్తాను.. జానపదంలో కూడా ట్రెడిషనల్ పాటలనే వెతుక్కుంటా.. ముఖ్యంగా మన సంస్కృతి, పల్లె వాతావరణం, సంప్రదాయాల ఉండే లిరిక్స్ ఉంటేనే పాడతాను.

పిచ్చి పిచ్చి లిరిక్స్ ఉంటే నేను అస్సలు వాటి జోలికి కూడా వెళ్లను. ముఖం మీదే చెప్పేస్త.. ‘నేను పాడను అన్న ఈ పాట అని’. ప్రస్తుతం మనం చూస్తే అర్థం లేని పాటలు చాలా వస్తున్నాయి. వాటి వల్ల ఏం ఉపయోగం. పాట అనేది మన సంస్కృతిని, సంప్రదాయాలను, విలువలను తెలియజేసేదిగా ఉండాలి. జానపదంలో కూడా స్వచ్ఛమైన.. మంచి అర్థవంతమైన పాటలకే ఎక్కువ మొగ్గుచూపుతా. అట్లాంటి పాటలే పాడతాను. 

ప్రతిఏడాది ఒక్కొక్క ఊర్లో.. 

బతుకమ్మ అనగానే ప్రతిరోజు పండుగే మాకు. ముఖ్యంగా చివరి రోజు సద్దుల బతుకమ్మరోజు మేం ఊర్లో చెరువుల దగ్గరకు వెళ్లి ఆడుకునేది. అదే పండుగ చివరిరోజు కావడంతో దిగులుగా కూడా ఉండేది. కాలంతో పాటు మనం మారాల్సి వస్తోంది. ఒక ఆర్టిస్టుగా బిజీ అయ్యాక.. ఈవెంట్స్‌లో బిజీ బిజీగా గడపాల్సి వస్తోంది. ప్రతి ఏడాది ఒక్కొక్క ఊర్లో మా పండుగ అయిపోతది. ఇలాంటి సందర్భాల్లో కుటుంబాన్ని చాలా మిస్ అవుతాం. పండుగ పూట నేను ఒక దగ్గర, మా ఆయన ఒక దగ్గర, నా బాబు మా అమ్మదగ్గర అట్ల ఒక్కొక్కరం ఒక్కొదగ్గర ఉంటాం. ఒక విధంగా కళకారుల జీవితమే ఇట్లుంది. 

పాడిన పాటల్లో కొన్ని..

ఎన్నెలకు వొచ్చినాయి/జొన్నల బండ్లు/నగదారిలో జొన్నల బండ్లు../జొన్నల బండ్లు కావవీ../ అన్నల బండ్లు../నగదారిలో అన్నల బండ్లు../ఎన్నెలకు వొచ్చినాయి../ఎన్నెలకు వొచ్చినాయి/నగదారిలో జొన్నల బండ్లు../అన్నల బండ్లుతై వొంగి మొక్కేనా.. నగదారిలో /వొంగి మొక్కకే చెల్లి ఆడిబిడ్డవే.. నగదారిలో/ ఆడిబిడ్డవే../వొంగి మొక్కకు చెల్లి../ఆడిబిడ్డవ్ నువ్వు../ఆడిబిడ్డవ్ నువ్వు.. అంటూ పాడిన పాట చాలా అర్థవంతంగా ఉంటుంది. దాని అర్థం కూడా అద్భుతంగా ఉంటుంది. 

(ఈ పాటకు అర్థం ఏంటంటే.. ఆడబిడ్డ వాళ్ల అన్నను ఆడుగుతుంది.. ‘నా కొడుకుకు ఇయుం డ్రి నీ బిడ్డను? అని. ఇయ్యకపోతే ఆడబిడ్డ దారెం ట తిట్టుకుంటూ, శాపనార్థలు పెట్టుకుంటూ పోతది. ఆడబిడ్డ శాపనార్థాలు ఇంటికి మంచిది కాదని.. అన్న చెల్లిని ఇంటికి పిలిచి వాళ్ల బిడ్డను ఇస్తారు.’ ఈ పాట అర్థం చాలా బాగుంటుంది. ముఖ్యంగా మన తెలంగాణలో ఆడబిడ్డను.. కూరాడు కుండతో కొలుస్తారు. అంటే చాలా పవిత్రంగా, అత్యంత వైభవంగా, ఆడబిడ్డలకు ఎంత మర్యాద చేస్తరంటే.. ఆడబిడ్డ పుట్టింటికి వస్తేనే కూరాడు కుండ ఎత్తిపిస్తరు. ఆడబిడ్డను అంత గొప్పగా చూడటం మన సంస్కృతిలో భాగంగా ఉన్నది. 

నాకు నచ్చిన పాట.. 

నాకు నచ్చిన పాట, పేరు తెచ్చిన పాట అంటే.. రేలారే రేలాలో నన్ను టైటిల్‌గా నిలబెట్టిన పాట అని చెబుతాను. దాన్ని ఎప్పుడూ నేను మరిచిపోను. ఆ పాటే.. పుట్ట మీద పాలపిట్ట/జాజిమొగులాలి../ముట్టవొతే.. తేలుగుట్టే/ జాజిమొగులాలి../ మంచమేసే మామ కొడుకా/జాజిమొగులాలి../ మంటమీద పాలపిట్ట/ జాబిమొగులాలి../ముట్టవొతే.. తేలుగుట్టే/జాజిమొగులాలి. (ఇది బావ, మరదలుకు సంబంధిం చిన పాట. చాలా అర్థవంతంగా ఉంటుంది.)

చారిత్రక కట్టడాలకు.. 

పగులురాళ్ల.. పాడుల దిబ్బా/ పోచమ్మా గుళ్లు/ అవి గానుగల కంచె/ ఆ కంచె చేన్లు/ నిలబడి/ కాలు తొక్కైయ్యో/ నాపై పాట పాడయ్యో..

కాకతీయ కోట మీద/ కోయిల కూసింది/ అది రమ్మనీ కోరింది/ కోయిలపాట/ కొంతపాడి/కొమ్మనెక్కయ్యో/నన్నో చూపుచూడయ్యా/.. 

(ఈ పాటలో మొత్తం మన తెలంగాణలోని చారిత్రక కట్టడాల మీదనే ఉంటది. గోల్కొండ కోట, భువనగిరి గుట్ట, కాకతీయ కోట, సమ్మక్క చార్మినార్ ఇలా అన్నీ చారిత్రక ప్రదేశాల గురించి ఈ పాటలో ఉంటుంది.) 

ఆడబిడ్డలకు ధైర్యం.. 

ఇది పూల పండుగ మాత్రమే కాదు.. మన ఆడబిడ్డలు వైభవంగా జరుపుకునే పుట్టింటి పండుగ. ఆడపిల్లలకు చెప్పేది ఒక్కటే.. అన్నీ రంగాల్లో మనం ముందు ఉన్నాం.. మగవారితో సమానంగా జీవించాలి. ఏ పని చేసినా భయపడకుండా బతకాలి. నిజంగా ఆడవాళ్లు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. అంతేకాదు ప్రతి కుటుంబం ఆడబిడ్డలకు ఆసరగా, అండగా ఉండాలి. అప్పుడే ఆడపిల్లలు, ఆడపడుచులు ఏవరైనా.. ఏదైనా సాధించగలుతారు.     

బతుకమ్మ పాట..

గాజులు గల్లుమని మోగినయ్../చప్పట్ల మోతకు../అరె కోలలు కోలాటం మాడినయ్../బతుకమ్మ పాటకు../ఎనిమిది దిక్కుల్కా/ఆటపాటలు ఆడుతుం టే../పల్లె జానపదం/ ఎల్లలన్నీ ఎలుతుంటే../కాళ్ల గజ్జలు గల్లుమని మోగు తుంటే../చుట్టూ జట్టుకట్టి పడుచులంతా/ఆడుతుంటే../ మేఘాలు చినులై రాలినయ్../పువ్వులను ముద్దులాడ రాళంగా../ పువ్వులే దేవతలై నిలిచినయ్../ పుడమే పులకించంగా../ లోకాలు జేజేలు పలికినయ్.. పూల జాతరే సాగంగా../ ఈ పాట స్వచ్ఛమైన బతుకమ్మను ప్రతిబింబిస్తున్నది. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగకు అద్దం పడుతుంది.  

ఊహ తెలిసినప్పటి నుంచి..

మాది నిజామాబాద్ జిల్లాలో ముల్లంగి గ్రామం. మాదొక చిన్న కుటుంబం. నేను పుట్టిన తొమ్మిది రోజులకే నాన్న చనిపోయాడు. చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ల ఇంటి దగ్గరే పెరిగాం. మా తాత టేప్‌రికార్డులో మల్లన్న కథ, బండారు మల్లన్న కథ,  ఒగ్గుకథ, ఎల్లమ్మ కథల క్యాసెట్లు వేసుకుని వినేది. మా తాత, అమ్మమ్మ, అమ్మ కూడా బాగా పాటలు పాడేవారు. మాది వ్యవసాయ కుటుంబం.

పొలాల్లో నాటు వేసేటప్పుడు.. పనులు చేసేటప్పుడు సహజంగా పాడే పాటలను వింటూ పెరిగా. ఓ విధంగా ఊహ తెలిసినప్పటి నుంచి పాట మధ్యలోనే పెరిగా. అలా పాటల ప్రభావం నాపై ఎక్కువగా పడ్డది. ఊర్లల్లో ఒకప్పుడు కోలాటం ఆడేవారట.. మా నాన్న కూడా కోలాటం ఆడేదని అందరూ అంటుంటారు. తన గురించి విన్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.

 రూప