calender_icon.png 17 November, 2024 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్ పోటీలోనే..

12-06-2024 12:51:54 AM

కెనడాపై భారీవిజయం 

సూపర్ 8 ఆశలు సజీవం

పొట్టి ప్రపంచకప్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న పాకిస్థాన్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. సూపర్-8 పోటీలో ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. కెనడాతో జరిగిన పోరులో మొదట బౌలర్లు విజృంభించి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేయగా.. ఆనక బ్యాటర్లు మిగిలిన పనిపూర్తిచేశారు. 

న్యూయార్క్: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తొలి విజయం నమోదు చేసుకుంది. తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో సూపర్ ఓవర్‌లో ఓడిన పాక్.. ఆ తర్వాత టీమిండియా చేతిలోనూ ఓటమి పాలవగా.. మంగళవారం జరిగిన పోరులో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో కెనడాపై విజయం సాధించింది. సూపర్ దశకు చేరాలంటే విజ యం తప్పనిసరి అయిన క్లిష్ట పరిస్థితుల్లో పాక్ ప్లేయర్లు సాధికారికంగా ఆడారు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కెనడా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. ఓపెనర్ ఆరో న్ జాన్సన్ (44 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నా.. మిగిలినవాళ్లంతా విఫలమ య్యారు. వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టిన పాక్ బౌలర్లు కెనడాను భారీ షాట్లు ఆడకుండా అడ్డుకున్నారు. నవ్‌నీత్ (4), ప్రగత్ సింగ్ (2), నికోలస్ కిర్టాన్ (1), శ్రేయస్ (2), రవీందర్ పాల్ సింగ్ (0) విఫలమయ్యారు.

చివర్లో కెప్టెన్ సాద్‌బిన్ జాఫర్ (10), కలీమ్ సనా (13 నాటౌట్) విలువైన పరుగులు జోడించారు. పాక్ బౌలర్లలో మహమ్మద్ అమీర్, హరీస్ రవుఫ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. షాహీన్ అఫ్రిది, నసీమ్ షా చెరో వికెట్ తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో పాకిస్థాన్ 17.3 ఓవర్లలో 3 వికెట్లకు 107 పరుగులు చేసింది. ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ (53 బంతుల్లో 53 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్సర్), కెప్టెన్ బాబర్ ఆజమ్ (33 బంతుల్లో 33 ఒక ఫోర్, ఒక సిక్సర్) రాణించారు. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు కెనడా కడవరకు కొట్లాడటం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

సిగ్గుపడుతున్నా : కమ్రాన్ అక్మల్

లాహోర్: టీమిండియా క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్‌ను అగౌరవపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నట్లు పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ వ్యాఖ్యానించాడు. సిక్కులను అవమానపరిచేలా మాట్లాడినందుకు తనను క్షమించాలని అక్మల్ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాక్ మ్యాచ్ సమయంలో కమ్రాన్ టీమిండియా బౌలర్ అర్ష్‌దీప్ మతాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడంపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తంచేశాడు.

తాజాగా కమ్రాన్ అక్మల్ మాట్లాడుతూ.. ‘సిక్కులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపడుతున్నా. ఈ విషయంలో హర్భజన్‌తో పాటు సిక్కుల కమ్యూనిటీకి క్షమాపణలు కోరుతున్నా. నేను చేసిన వ్యాఖ్యలు అగౌరపరిచేలా ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న సిక్కులందరిపైన గౌరవం ఉంది.. ఉద్దేశపూర్వకంగా ఎవర్నీ బాధించాలనుకోలేదు. క్షమించమని మరోసారి అడుగుతున్నా’ అని హర్భజన్‌ను ట్యాగ్ చేస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టాడు.