- ప్రభుత్వ నిబంధనలతో మిల్లర్లకు ఇబ్బందులు
- కేంద్రాల్లో పేరుకుపోతున్న రాశులు
- నిర్మల్ జిల్లాలో 1,47 లక్షల మెట్రిక్ టన్నులకు కొన్నది 8 వేల టన్నులు మాత్రమే
నిర్మల్, నవంబర్ 19 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో వరి ధాన్యం అమ్ముకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలో వానాకాలంలో సుమారు 1.20 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా 1.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు.
ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 284 కోనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుని 264 కేంద్రాల్లో కోనుగోళ్లు ప్రారంభించారు. కోనుగోలు కేంద్రాలకు ధాన్యం పోటెత్తుతున్నా కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు కేవలం 8 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు.
ప్రభుత్వ నిబంధనలతో తిప్పలు
ప్రభుత్వం ఈసారి ధాన్యం కొనుగోళ్లలో కొత్త నిబంధనలు తీసుకురావడంతో రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. గతంలో రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యంలో సీఎంఆర్ బియ్యం ఇవ్వని మిల్లర్లకు ధాన్యం కేటాయించడం లేదు. జిల్లాలో ఇప్పటికే ఏడు పెద్ద రైస్ మిల్లర్లపై రికవరీ కేసులు నమోదయ్యాయి.
జిల్లాలో మొత్తం 92 రైస్ మిల్లులు ఉండగా అందులో 32 డీఫాల్టర్‌లుగా ఉండటంతో మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే ధాన్యం కేటాయింపులు ఇచ్చేందుకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో కొందరు రైస్ మిల్లర్లు ప్రభుత్వం ధాన్యం తీసుకోవడానికి నిరాసక్తత చూపుతున్నారు. ధాన్యం తీసుకునే విలువలో 20 శాతం బ్యాంకు డిపాజిట్ కోరడంతో డిపాజిట్ డబ్బులు లేక వడ్డీలకు కోసం ప్రవేట్ వారిని సంప్రదిస్తున్నారు.
స్థానికంగా ఉన్న బ్యాంకుల్లో రుణం తీసుకుందామనుకున్నా అప్పటికే వారు వ్యవసాయ భూములు, రైస్ మిల్లులపై అప్పులు ఉండటంతో కొత్త అప్పులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. రైస్ మిల్లర్ల సమస్య ధాన్యం కొనుగోళ్లపై పడుతోంది. తూకం వేసిన ధాన్యం రైస్ మిల్లర్లకు పంపే అవకాశం లేక పోవడంతో కోనుగోళ్లలో జాప్యం జరుగుతోంది.
కేంద్రాల్లో పేరుకుపోతున్న ధాన్యం
జిల్లాలో కొనుగోలు కేంద్రాలకు భారీ ఎత్తున రైతులు ధాన్యం తీసుకువస్తున్నారు. అయితే కోనుగోళ్లలో జాప్యం జరుగుతుండటంతో కేంద్రాల్లో ధాన్యం రాశులు పేరుకు పోతున్నాయి. కొన్ని గ్రామాల్లో కొనుగోళ్లు ప్రారంభమైనా స్థలాలు లేక పోవడంతో రోడ్డుపైనే ధాన్యం ఆరబోస్తున్నారు.