“కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో ఓ సందమామ” పాట తెలుగు నాట సినీ ప్రియులకు సుపరిచితమే. దర్శకుడు హరీష్ శంకర్‌కి ఇది గుర్తొచ్చే కాబోలు హీరో రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సెతో కలిసి సరాసరి ఆ లోయల్లోకి దిగిపోయారు. హీరో హీరోయిన్లు అటువంటి లొకేషన్‌లో ఉన్నపుడు పాటేసుకోకుండా ఉంటారా..? ఇక్కడ కూడా అదే జరిగింది. ఇంక చేసేదేముంది అంటూ ఛాయాగ్రాహకుడు అయనంక బోస్‌ని పిలిచి ‘అటు కాశ్మీరు అందాల్ని.. ఇటు కథానాయిక సోయగాల్ని..’ ఏకకాలంలో బంధించమన్నారు. శేఖర్ మాస్టర్ నేర్పిన డాన్సులు చేసే క్రమంలో పూణె పడుచు అయిన బోర్సె చీర కుచ్చిల్లు కాస్త జారినట్టున్నాయి. అది గమనించిన రవితేజ గేయ రచయిత సాహితి మాటలను అరువు తెచ్చుకుని “నీ కుచ్చిలి మార్చి ముచ్చట తీర్చేయ్ నా” అంటూ వాటిని సర్దేపనిలో పడ్డారు. తర్వాతేం జరిగిందన్నది అన్నది తెలియాలంటే ‘మిస్టర్ బచ్చన్’ విడుదల వరకు ఆగాల్సిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. గత నాలుగు రోజులుగా కాశ్మీరులో తెరకెక్కిస్తున్న ఈ పాట ప్రేక్షకులను మైమరిపిస్తుందని చిత్ర బృందం తెలిపింది. జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ స్వరాలందిస్తున్నారు.