calender_icon.png 18 October, 2024 | 7:43 AM

రూ.77,000 దాటిన పసిడి

26-09-2024 12:07:30 AM

తొలిసారిగా ఆభరణాల బంగారం రూ.7వేల పైకి

హైదరాబాద్, సెప్టెంబర్ 25: ప్రపంచ ప్రధాన కేంద్ర బ్యాంక్‌ల వడ్డీ రేట్ల కోతలతో అటు ప్రపంచంలోనూ, ఇటు దేశీ యంగానూ బంగారం ధర పరుగు పెడుతున్నది. ఏ రోజుకారోజు కొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర తొలిసారిగా రూ.77,000 మించింది.

యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ భారీగా అరశాతం వడ్డీ రేటును తగ్గించి కొద్దిరోజులు గడవకముందే బుధవారం పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వడ్డీ రేటును 30 బేసిస్ పాయింట్లు (0.30 శాతం) తగ్గించింది. దీంతో  ప్రపంచ మార్కెట్లో  ఔన్సు పసిడి ఫ్యూచర్ ధర 2,685డాలర్ల కొత్త రికార్డుస్థాయికి చేరింది.

ఈ నేపథ్యంలో బుధవా రం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారట్ల తులం పసిడి ధర మరో రూ. 660 పెరిగి,  రూ. 77,020 వద్ద నిలిచింది. వారం రోజుల్లో ఈ ధర రూ. 2,000కుపైగా ఎగిసింది. ఇదేబాటలో 22 క్యారట్ల ఆభరణాల బంగారం ధర రూ.600 పెరిగి రూ.70,600 వద్దకు చేరుకున్నది.

యూఎస్ ఫెడ్ కమిటీ సభ్యు ల్లో పలువురు మరిన్ని వడ్డీ రేట్ల కోతలు ఉంటాయంటూ సంకేతాలు ఇవ్వడంతో బంగారం రికార్డు గరిష్ఠస్థాయిల్ని అందుకుంటున్నదని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ చెప్పారు.

యూఎస్ ఆర్థిక అనిశ్చితి, ఫెడ్ సరళ ద్రవ్య విధానంతో పసిడి వరుసగా ఐదో రోజునా పెరిగిందని, చైనా కేంద్ర బ్యాంక్ రేట్ల తగ్గింపుతో పాటు పలు ఆర్థిక ఉద్దీపన చర్యల్ని ప్రకటించడంతో బ్రేకుల్లేకుండా బంగారం పరుగు కొనసాగుతు న్నదని ఆనంద్‌రాఠి స్టాక్ బ్రోకర్స్ కమోడిటీస్ విశ్లేషకుడు మనీశ్ శర్మ వివరించారు. 

రూ.లక్ష దాటిన వెండి

ఒక్కరోజులోనే రూ.3,000 పెరుగుదల

వెండి ధర సైతం భారీగా పెరిగింది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర బుధవారం ఒక్కరోజులోనే రూ. 3,000 పెరిగి రూ.1,01,000 వద్దకు చేరింది.