calender_icon.png 13 January, 2025 | 10:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెట్టాపట్టాల్

23-07-2024 01:25:13 AM

  • కోహ్లీతో బంధం పర్సనల్: గంభీర్
  • శ్రీలంకకు టీమిండియా

టీమిండియా కొత్త కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టాడు. లంకతో సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేసిన అనంతరం సోమవారం హెడ్‌కోచ్ హోదాలో గంభీర్ తొలిసారి మీడియాతో మాట్లాడాడు. కోహ్లీతో వివాదం, సూర్యకుమార్‌కు సారథ్యం, జడ్డూను వన్డేలకు ఎంపిక చేయకపోవడం.. ఇలా పలు అంశాలపై గౌతీ క్లారిటీ ఇచ్చాడు.

ముంబై: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీతో అనుబంధం తన వ్యక్తిగతమని భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. కేవలం టీఆర్పీ కోసమే కోహ్లీతో బంధం పెంచుకోలేదని.. చాలా కాలంగా అతడితో మంచి స్నేహం ఉందని గంభీర్ తెలిపాడు. శ్రీలంక పర్యటనకు ముందు తొలిసారి ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరైన గంభీర్ పలు విషయాలపై చర్చించాడు. ‘కోహ్లీతో నా రిలేషన్‌షిప్ పర్సనల్. టీఆర్పీ కోసం మా బంధాన్ని పబ్లిక్‌లో పెట్టలేను. ఆఫ్‌ఫీల్డ్‌లో మా మధ్య మంచి అనుబంధం ఉంది. నేను అతడితో ఎన్నిసార్లు మాట్లాడాననేది నాకు తెలుసు.

మేమిద్దరం ఇప్పుడు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. కోహ్లీ ప్రపంచస్థాయి క్రికెటర్. మా బంధం ఇలాగే కొనసాగిస్తామని ఆశిస్తున్నా. జడేజాను పక్కనబెట్టినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. రానున్న కాలంలో 10 టెస్టులు ఆడాల్సి ఉంది. జడేజా లాంటి సీనియర్ ఆల్‌రౌండర్ సేవలు అవసరం. వర్క్‌లోడ్ దృష్ట్యా బుమ్రాకు రెస్ట్ ఇచ్చాం. సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ త్వరలో జట్టులోకి వస్తాడని ఆశిస్తున్నాం. సెప్టెంబర్ 19న తొలి టెస్టు ఆడబోతున్నాం. షమీ దానిని డెడ్‌లైన్‌గా పెట్టుకున్నాడు. సర్జరీ అనంతరం పూర్తిగా కోలుకున్న షమీ బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించినట్లు ఎన్‌సీఏ తెలిపింది. మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉంటారా అనే దానిపై ఇప్పుడేం చెప్పలేను’ అని అన్నాడు. 

కెప్టెన్‌గా సూర్య ఎందుకంటే?

భారత టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్‌ను ఎంపిక చేయడాన్ని జాతీయ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సమర్థించాడు. ‘సూర్య బెస్ట్ టీ20 బ్యాటర్ మాత్రమే కాదు. జట్టును సమర్థంగా నడిపే ఆలోచన అతడిలో ఉంది. అందుబాటులో ఉండటం కూడా ప్రధాన సమస్యే. పనిభారాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయానికి వచ్చాం. అందుకే పాండ్యాను కాదని సూర్యకు బాధ్యతలు అప్పగించాం. కెప్టెన్‌గా అతడు రాణిస్తాడనే నమ్మకముంది’ అని అగార్కర్ పేర్కొన్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడేందుకు సూర్యకుమార్ సారథ్యంలోని టీమిండియా సోమవారం లంకకు బయల్దేరి వెళ్లింది. ఇరుజట్ల మధ్య శనివారం తొలి టీ20 జరగనుంది.