- నేడు జీహెచ్‌ఎంసీ జనరల్ బాడీ సమావేశం
- రాష్ట్రంలో అధికార మార్పిడితో బల్దియాపై ప్రభావం
- కాంగ్రెస్‌లో చేరిన మేయర్, డిప్యూటీ మేయర్
- హోరాహోరీగా నేటి కౌన్సిల్!
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 5(విజయక్రాంతి): తెలంగాణ ఆవిర్భావం నుంచి పదేళ్ల పాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కొనసాగడంతో బల్దియాలో అధికార పక్షంగా కొనసాగింది. 2023 ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో అప్పటి వరకు బీర్‌ఎస్‌లోనే ఉన్న జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా కొనసాగుతున్న మోతె శ్రీలతాశోభన్‌రెడ్డి ఆ పార్టీనీ వీడి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో వారిద్దరూ అప్పుడు, ఇప్పుడు అధికార పక్షంలోనే కొనసాగుతున్నారు. వారు బీఆర్‌ఎస్‌లో ఉన్న ప్పుడు మూడేళ్ల పాటు అధికార పార్టీ సభ్యులుగా కొనసాగిన బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ప్రస్తుతం విపక్ష సభ్యులుగా మారిపోయారు. దీంతో బల్దియాలో రాజకీయ ముఖచిత్రం విచిత్రమైన పరిస్థితులను చవిచూస్తుందని చెప్పవచ్చు. ఈ ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో బల్దియా జనరల్ బాడీ సమావేశం నేడు వాడీ, వేడీగా జరగనుంది.
బల్దియాలో బలాబలాలు
వాస్తవానికి 2020 డిసెంబరులో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 56, బీజేపీకి48, ఎంఐఎం పార్టీకి 44, కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు దక్కాయి. బీఆర్‌ఎస్ పార్టీ ఎంఐఎం మద్దతుతో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను కైవసం చేసుకుంది. వీరిలో ఇద్దరు ఎంఐఎం కార్పొరేటర్లు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా గెలుపొందగా, ఒకరు మరణించారు. బీజేపీకి చెందిన గుడిమల్కాపూర్ కార్పొరేటర్ కూడా మరణించారు. 2 స్థానాలు మాత్రమే గెలుపొందిన కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం మేయర్, డి ప్యూటీ మేయర్ ఉండగా.. 19 మంది సభ్యులు కాంగ్రెస్ పార్టీకి మద్దుగా ఉన్నట్లు తెలుస్తున్నది.
ఈ విషయమై తమ సభ్యులను ప్రొటోకాల్ జాబితాలో చేర్చాలని కాంగ్రెస్ కార్పొరేటర్ రాజశేఖర్‌రెడ్డి జీహెచ్‌ఎంసీ కార్యదర్శికి లేఖ అందజేశారు. దీంతో బీఆర్‌ఎస్‌కు 47, ఎంఐఎంకు 41, బీజేపీకి 39, కాంగ్రెస్ పార్టీకి 19 మంది కార్పొరేటర్ల మద్దతు ఉన్నట్టుగా తెలుస్తున్నది.
రాజీనామా చేయాలని డిమాండ్
శనివారం సమావేవం జరుగున్న నేపథ్యంలో శుక్రవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌కు చెందిన కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో మేయర్, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాసం పెట్టాలనే చర్చ వచ్చినట్టుగా తెలుస్తున్నది. మేయర్ పదవికి అవిశ్వాసం పెట్టాలంటే నాలుగేళ్లు పూర్తి కావాల్సి ఉంటుంది. ఈ కారణంగా అవిశ్వాసం తీర్మానాన్ని వదిలేసి బీఆర్‌ఎస్‌లో గెలుపొందిన మేయర్, డిప్యూటీ మేయర్‌లు నైతికంగా రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌ను ఆ పార్టీ సభ్యులు కౌన్సిల్‌లో లేవనెత్తతున్నారు.
కాంగ్రెస్‌కు మద్దతుగా ఎంఐఎం!
2020 బల్దియా ఎన్నికల్లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల ఎంపిక నాటికి ఎంఐఎం 44స్థానాలు కలిగి ఉండి, బీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచింది. ప్రస్తుతం ఎంఐఎం అధినేత కాంగ్రెస్‌కు మద్దతుగా సంకేతాలిస్తున్నారు. దీంతో జీహెచ్‌ఎంసీలో అవసరమైతే ప్రస్తుతం ఎంఐఎం పార్టీకి చెందిన 39మంది సభ్యులు కాంగ్రెస్‌కు మద్దతుగా ఉండే అవకాశం ఉంది.