calender_icon.png 5 November, 2024 | 12:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బల్దియాలో బలాలు తారుమారు!

16-07-2024 03:04:22 AM

  • ఎమ్మెల్యేలతో పాటు ఫిరాయింపులకు కార్పొరేటర్లు సై 
  • జీహెచ్‌ఎంసీలో బలం పెంచుకునే దిశగా కాంగ్రెస్
  • ఇప్పటికే 3 నుంచి 23కు చేరిన సభ్యులు 
  • మరో 10 మంది కార్పొరేటర్లు చేరే అవకాశం 
  • వచ్చే కౌన్సిల్ సమావేశానికి ఫుల్ మెజార్టీకి ఛాన్స్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 15 (విజయక్రాంతి): రాష్ట్ర రాజకీయ సమీకర ణాలకు అనుగుణంగానే నగర రాజకీయాలు కూడా మారుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ ఎంసీ)లోనూ కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ వ్యూ హంలో బీఆర్‌ఎస్ పార్టీని ఖాళీ చేయించాలనే రాజకీయ లక్ష్యం కూడా ఉన్నట్టుగా కన బడుతోంది. అధికారం ఒక దగ్గర ఉంటే మేం మాత్రం మరో చోట ఎందుకనే సూత్రీకరణను బల్దియా కార్పొరేటర్లు కూడా అనుసరిస్తున్నట్టుగా స్పష్టమవుతోంది.

ఈ నేపథ్యంలోనే జీహెచ్‌ఎంసీలో ముగ్గురు మాత్రమే గెలుపొందిన కార్పొరేటర్ల సంఖ్య ను మరింత పెంచుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నట్టుగా సమాచారం. మ రో మూడు నెలల్లో జరగనున్న జనరల్ కౌన్సిల్ సమావేశం నాటికి పార్టీల బలాబలాల సంఖ్య 2020 నాటి ఫలితాలతో పోలిస్తే తారుమారు అయ్యే అవకాశాలు లేకపోలేదు. 

2020 ఎన్నికల ఫలితాలు ఇలా.. 

జీహెచ్‌ఎంసీలో 2020లో జరిగిన ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ అధి కారంలో ఉంది. ఈ సమయంలో బల్దియా ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 56, బీజేపీ 48, ఎంఐఎం 44 స్థానాలను గెల్చుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉప్పల్, ఏఎస్‌రావు నగర్ డివిజన్లలో మాత్రమే గెలిచింది. కొన్నాళ్లకే లింగోజిగూడ (బీజేపీ) కార్పొరేటర్ మరణించిన కారణంగా జరిగిన ఉప ఎన్నికలో ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం జీహెచ్‌ఎంసీ 150 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ బలం 3 స్థానాలకు చేరుకుంది. ఇదిలా ఉండగా, బీజేపీకి చెందిన 47 కార్పొరేటర్లలో ఏడుగురు బీఆర్‌ఎస్‌లో చేరారు.

2023 అసెంబ్లీ ఎన్నికలలో అధికారం కోల్పోవడంతో మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గత పాలక మండలి (2016)లో మేయర్, డిప్యూటీ మేయర్‌గా కొనసాగిన బొంతు రామ్మోహన్, బాబా ఫసియోద్ద్దీన్ సైతం ఆ పార్టీని వదిలి కాంగ్రెస్‌లో చేరారు. 

పెరుగుతున్న ఫిరాయింపులు.. 

వాస్తవానికి రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీకి అధికారం లేకున్నా 2025 ఫిబ్రవరి వరకు మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎలాంటి ఢోకా లేదు. అయినా వారు బీఆర్‌ఎస్‌ను వదిలి కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం బొంతు శ్రీదేవి (చర్లపల్లి), బాబా ఫసియోద్దీన్(బోరబండ)తో పాటు అల్వాల్ కాలనీ, మాదాపూర్, కాప్రా తదితర మొత్తం 19 మంది కార్పొరేటర్లు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారు. వీరిలో కొందరు బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌కు, ఆ తర్వాత బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌కు మారిన వారు ఉన్నారు.

రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌తో పాటు రాజేంద్రనగర్ కార్పొరేటర్ అర్చన జయప్రకాశ్ కాంగ్రెస్‌లో చేరగా, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో పాటు శేరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్ కార్పొరేటర్లు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. హైదర్‌నగర్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్ యూఎస్‌ఏలో ఉండడంతో వారితో పాటు కలవనట్టుగా తెలుస్తోంది. తాజా లెక్కల ప్రకారం జీహెచ్‌ఎంసీలో తమ మద్దతుదారుల సంఖ్య 23కు చేరుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. 

మారనున్నబలాబలాలు.. 

ప్రస్తుతం బల్దియాలో ఇద్దరు సభ్యులు ఎమ్మెల్యేలు కాగా, మరో ఇద్దరు మరణించారు. దీంతో కార్పొరేటర్ల సంఖ్య 146గా ఉంది. చట్ట ప్రకారం పాలక మండలికి నాలుగేళ్లు నిండకపోవడంతో మేయ ర్, డిప్యూటీ మేయర్‌లు పార్టీ ఫిరాయింపులు చేసినందుకు అవిశ్వాసం పెట్టే అవకాశం లేనందున ఈ నెల 6న జరిగిన కౌన్సిల్‌లో అవిశ్వాసానికి బదులుగా రాజీనామా చేయాలని మాత్రమే బీఆర్‌ఎస్ డిమాండ్ చేయాల్సి వచ్చింది. తాజాగా రెండ్రోజుల్లోనే ఐదుగురు కార్పొరేటర్లు బీఆర్‌ఎస్‌ను వదిలి కాంగ్రెస్‌లో చేరడంతో కాంగ్రెస్ సంఖ్య 23కు చేరింది. మరికొద్ది రోజుల్లో మరో 10 మంది కార్పొరేటర్లు చేరుతారనే ఊహాగానాలున్నాయి.

దీంతో వీరి బలం 33కు చేరుతుంది. ప్రభుత్వానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతుగా ఉంటున్న ఎంఐఎం పార్టీ సభ్యులు 43 మంది బల్దియాలో కూడా కాంగ్రెస్‌కు మద్దతు తెలిపే అవకాశం ఉంది. రానున్న జనరల్ కౌన్సిల్ సమావేశానికి మరో 3 నెలల సమయం ఉన్నందున ఈలోగా మరికొందరు చేరితే 2020 నాటి ఫలితాలలో బీఆర్‌ఎస్‌కు ఉన్న 56 స్థానాల సంఖ్యను కాంగ్రెస్ చేరుకునే అవకాశాలున్నాయి. దీంతో 2025 ఫిబ్రవరి నాటికి మేయర్, డిప్యూటీ మేయర్‌కు నాలుగేళ్లు నిండినా కూడా ఎలాగో ఎంఐఎం మద్దతు ఉండే అవకాశాలున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ సభ్యుల నుంచి అవిశ్వాసం ప్రస్తావన వచ్చే అవకాశాలు కన్పించడం లేదు.