* చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే
* రెవెన్యూ సంఘాల నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాం తి): కొత్త ఆర్వోఆర్ చట్టంగా భూభారతి త్వరలోనే అమల్లోకి రానుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భూభారతితో రైతులకు మెరుగైన రెవెన్యూ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కొత్త చట్టంతోనే భూ సమస్యలకు సైతం పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ), తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టీజీఆర్‌ఎస్‌ఏ) నూతన సంవత్సర డైరీలను సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ఆవిష్కరించారు.
ఈ సంద ర్భంగా కొత్త ఆర్వోఆర్ చట్టం, దానిలోని ప్రధాన అంశాల విషయంపై సీఎం తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీ లచ్చిరెడ్డితో చర్చించారు.
ధరణితో రాష్ర్టంలో భూ సమస్యలు పెరిగాయ ని, రైతులకు, ప్రజలకు రెవెన్యూ సేవలను వేగంగా, సులభంగా అందించే లక్ష్యంతోనే భూభారతిని తీసుకొస్తున్నట్టు సీఎం పేర్కొన్నారు.
జిల్లాస్థాయిలోనే అన్ని రకాల భూ సమస్యలకు పరిష్కారం లభించేలా కొత్త చట్టంలో ఉందని చెప్పారు. ఇదే కాకుండా రెవెన్యూ అధికారులకు సైతం వివిధ స్థాయి ల్లో అధికారాలను కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు.
కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణ, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్షకార్యదర్శులు ఎస్ రాములు, రమేశ్ పాక, సెక్రటరీ జనరల్ ఫూల్‌సింగ్ చౌహాన్, శ్రీనివాసులు, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్షకార్యదర్శులు పాల్గొన్నారు.
తహసీల్దార్ల బదిలీలను చేపట్టండి: లచ్చిరెడ్డి
రాష్ర్టంలో ఎన్నికల సమయంలో తహసీల్దార్లను వివిధ జిల్లాలకు బదిలీ చేశారని సీఎం రేవంత్‌రెడ్డికి లచ్చిరెడ్డి వివరించారు. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లను నేటికీ కూడా సొంత జిల్లాలకు బదిలీ చేయలేదని గుర్తుచేశారు. దీంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. సానుకూలంగా స్పందించారని లచ్చిరెడ్డి తెలిపారు.